ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు 'దిల్' రాజు ఊపిరి పీల్చుకున్నారు. ఆయన నిర్మాణంలో వచ్చిన చిత్రం "ఎఫ్-2" (ఫన్ అండ్ ఫస్ట్రేషన్). సంక్రాంతికి సందర్భంగా ఈనెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి, మంచి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో కలెక్షన్లపరంగా దూసుకెళుతోంది.
నిజానికి 'దిల్' రాజు గత సినిమాలన్నీ వరుస పరాజయాలను చవిచూశాయి. దీంతో ఆయన ఆర్థికంగా బాగా నష్టపోయారు. పెద్ద హీరోలతో నిర్మించిన చిత్రాలు సైతం బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. దీంతో ఆయన ఆర్థిక కష్టాలను చవిచూడాల్సి వచ్చింది.
ఈ క్రమంలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ - తమన్నా, మెహ్రీన్‌ల కాంబినేషన్‌లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'ఫన్ అండ్ ఫస్ట్రేషన్' (ఎఫ్-2). పూర్తి వినోదభరితంగా, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం మంచి మార్కులు కొట్టేసింది.
పైగా, కలెక్షన్లపరంగా కూడా బాగానే వసూలు చేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 9.2 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో సైతం మిలియన్ మార్కును దగ్గరవుతోంది. ఫుల్ రన్ ముగిసే సమయానికి భారీ లాభాలు మిగిలే సూచనలు కనిపిస్తున్నాయి.
మరోవైపు, మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం 'వినయ విధేయ రామ'. ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం నెగెటివ్ టాక్‌ను సొంతం చేసుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా దూసుకెళుతోంది. తొలి రోజే రూ.26.09 కోట్ల మేరకు షేర్ రాబట్టి నిర్మాతకు కాసుల వర్షం కురిపిస్తోంది.
ఇదిలావుంటే, ఈ సంక్రాంతికి బరిలోకి దిగిన సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా మరోమారు తన సత్తా చాటాడు. 'పేట' పేరుతో వచ్చిన ఆయన.. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి కూడా పాజిటివ్ టాక్ వచ్చింది. పైగా, మూడు భాషల్లో కలిపి ఏకంగా రూ.100 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. కార్తీక్ సుబ్బురాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ అధినేత దయానిధి మారన్ నిర్మించారు.