'మా' కార్యాలయానికి తాళం... నేడు అత్యవసర భేటీ
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) సభ్యుల్లో నివురుగప్పిన నిప్పులా ఉన్న వివాదం ఒక్కసారి బహిర్గతమైంది. నిధులు దుర్వినియోగమైనట్టు వార్తలు గుప్పుమన్నాయి. ఈ అంశంపై మా కార్యవర్గ సభ్యుల మధ్య విభేదాలుపొడచూపాయి.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) సభ్యుల్లో నివురుగప్పిన నిప్పులా ఉన్న వివాదం ఒక్కసారి బహిర్గతమైంది. నిధులు దుర్వినియోగమైనట్టు వార్తలు గుప్పుమన్నాయి. ఈ అంశంపై మా కార్యవర్గ సభ్యుల మధ్య విభేదాలుపొడచూపాయి. దీంతో మా కార్యాలయానికి కార్యదర్శి సీనియర్ హీరో నరేష్ తాళం వేసినట్టు వార్తలు వస్తున్నాయి.
నిజానికి గతంలో మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ అధ్యక్ష ఎన్నికల సమయంలో రాజేంద్రప్రసాద్, జయసుధలలో ఎవరికి అధ్యక్ష పదవి ఇవ్వాలనే తీవ్ర పోటీ నెలకొంది. ఈ ఎన్నికల్లో చివరకు రాజేంద్ర ప్రసాద్ విజయం సాధించారు. ఆ సమయంలో మా మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. ఆ తర్వాత ఎన్నికల్లో శివాజీ రాజాను ఏకగ్రీవంగా ఎన్నుకొని 'మా' అధ్యక్షుడిగా నియమించడం జరిగింది.
అయితే తాజాగా 'మా' నిధులు స్వాహా అయ్యాయి అనే ఆరోపణలతో మరోసారి 'మా' హాట్‌టాపిక్‌గా మారడం విశేషం. దీంతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో విభేదాలు భగ్గుమన్నాయి. అధ్యక్ష, కార్యదర్శుల మధ్య వివాదం నెలకొంది. సంఘం కార్యాలయానికి కార్యదర్శి నరేష్ తాళం వేశారు. దీంతో 'మా' అసోసియేషన్ అత్యవసర సమావేశం నిర్వహించారు.
సుమారుగా 4 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో శివాజీ రాజా వివరణ ఇవ్వడంతో నరేష్ తృప్తి చెందారు. ఈ నేపథ్యంలో అసోసియేషన్ సభ్యులందరి మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. దాంతో అంతా కలిసి పనిచేస్తామని నేతలు ప్రకటించారు. అలా వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని స్పష్టంచేశారు.