Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నంది అవార్డు దక్కించుకున్న దాసరి తిరుపతి నాయుడు

Dasari Tirupati Naidu, R. Narayana Murthy
, సోమవారం, 17 జులై 2023 (18:37 IST)
Dasari Tirupati Naidu, R. Narayana Murthy
ఏ పాత్రలోనైనా సునాయాసంగా పరకాయ ప్రవేశం చేయగల మరో గొప్ప నటుడు తెలుగు చిత్ర సీమకు లభించాడు. రంగస్థలంపై తన ప్రతిభను ఘనంగా ప్రకటించుకున్న ఆ నటుడు... ఇప్పుడిప్పడే తన నట వైదుష్యాన్ని వెండి తెరకు పరిచయం చేస్తున్నాడు. ఉపాధ్యాయుడిగా వేలాదిమంది విద్యార్థులు ఉన్నత స్థానాలు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించడంతోపాటు, తన తనయులు ముగ్గురినీ ప్రయోజకులుగా తీర్చిదిద్ది... రంగస్థలం తీర్చని తన నట దాహాన్ని సినిమా రంగంలో తీర్చుకోవాలని తహతలాడుతున్న. ప్రతిభాశాలి  దాసరి తిరుపతి నాయుడు. 
 
ఉత్తరాంధ్రలో పేరెన్నికగన్న రంగస్థల కళాకారుడు దాసరి అప్పలస్వామి తనయుడైన తిరుపతి నాయుడు... తన తండ్రి నుంచి నటనను పుణికిపుచ్చుకుని... "తండ్రిని మించిన తనయుడి"గా పేరు గడించుకున్నాడు. "మోహినీ భస్మాసుర" నాటకంలో భస్మాసుర పాత్రకు గాను "ఉత్తమ నటుడు"గా నంది అవార్డును సైతం కైవసం చేసుకున్నాడు. ఉపాధ్యాయుడిగా తనను తాను నిరంతరం సానబెట్టుకుంటూ... ఒకటి కాదు రెండు కాదు ముచ్చటగా మూడు "పీ.జీ"లు చేసి, ఉపాధ్యాయ వృత్తికి నూటికి నూరు పాళ్ళు న్యాయం చేసిన తిరుపతి నాయుడు... ఉద్యోగ విరమణ అనంతరం హైదరాబాద్ లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని... ఇకపై తన అనుభవాన్ని సినిమా రంగానికి అంకితం చేసేందుకు నిర్ణయించుకున్నాడు!!
 
విజయనగరం జిల్లా, బాడంగి మండలం, "గొల్లాది" గ్రామవాసి అయిన తిరుపతి నాయుడు... "కృష్ణుడు, అర్జునుడు, గయుడు, హరిశ్చంద్రుడు, జరాసంధుడు, భస్మాసురుడు అగ్నిద్యోతనుడు" వంటి పౌరాణిక పాత్రలతోపాటు... సాంఘిక పాత్రలతోనూ చెలరేగిపోయి... మెల్లగా సినిమా రంగాన్ని ఆకట్టుకోవడం ఆరంభించారు. ఉద్యోగ, కుటుంబ బాధ్యతలకు భంగం వాటిల్లనివ్వకుండా... "ఆ ముగ్గురు, మన్మధరెడ్డి, జనఘోష, అమృతభూమి, వాడు ఎవడు, రహస్యం, సీత, సర్కారువారి పాట" వంటి చిత్రాలతో సినిమా రంగానికి తన ఉనికిని పరిచయం చేసుకున్న ఈ ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ... పీపుల్ స్టార్ ఆర్.నారాయణమూర్తి కంట్లో పడ్డాడు. 
 
ప్రతిభకు పట్టాభిషేకం చేసే... ఆర్.నారాయణ మూర్తి... "మార్కెట్ లో ప్రజాస్వామ్యం" చిత్రంలో పారిశ్రామికవేత్త పాత్రనిచ్చి ప్రోత్సహించారు. ఆ చిత్రంలో తిరుపతి నాయుడు నటనకు ముగ్ధుడైన పీపుల్ స్టార్... తన తదుపరి చిత్రం "యూనివర్సిటీ"లో ప్రధాన ప్రతి నాయకుడి పాత్రనిచ్చి... తెలుగు సినిమా రంగానికి ఒక మంచి నటుడ్ని అందించారు. నిడివితో నిమిత్తం లేకుండా... పారితోషికం గురించి పెద్దగా పట్టించుకోకుండా... నటుడిగా నాలుగు కాలాలపాటు నిలిచిపోయే పేరు తెచ్చుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు  "దాసరి తిరుపతి నాయుడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

80ల నేపథ్యాన్ని తీసుకున్నా అందరూ మెచ్చే చిత్రం అన్నపూర్ణ ఫోటో స్టూడియో: దర్శకుడు చెందు ముద్దు