Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాటే ఆయుధంగా సాగిన దాశరథి కృష్ణమాచార్య

పాటే ఆయుధంగా సాగిన దాశరథి కృష్ణమాచార్య
, మంగళవారం, 21 జులై 2015 (21:20 IST)
తెలంగాణ ప్రజల కన్నీళ్లను అగ్నిధారగా మలిచి నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి దాశరథి కృష్ణమాచార్య. దాశరథిగా ఆయన సుప్రసిద్ధుడు. పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకొని తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించిన దాశరథి ప్రాతఃస్మరణీయుడు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని గర్వంగా ప్రకటించి ఇప్పటి ఉద్యమానికీ ప్రేరణనందిస్తున్న కవి దాశరథి.
 
దాశరథి కృష్ణమాచార్య 1925 జూలై 22న వరంగల్‌ జిల్లా గూడూరు గ్రామంలో జన్మించాడు. ప్రస్తుతం ఈ గ్రామం ఖమ్మం జిల్లాలో ఉంది. బాల్యం ఖమ్మం జిల్లా మధిరలో గడిచింది. ఉర్దూలో మెట్రిక్యులేషను, భోపాల్‌ విశ్వవిద్యాలయం నుండి ఇంటర్మీడియెట్‌, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఇంగ్లీషు సాహిత్యంలో బిఎ చదివాడు. సంస్కృతం, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో మంచి పండితుడు. చిన్నతనంలోనే పద్యం అల్లటంలో ప్రావీణ్యం సంపాదించాడు. హైదరాబాదు సంస్థానంలో నిజాం అరాచక ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో పాలుపంచుకున్నాడు.
 
ఉపాధ్యాయుడిగా, పంచాయితీ ఇన్స్పెక్టరుగా, ఆకాశవాణి ప్రయోక్తగా ఉద్యోగాలు చేసాడు. సాహిత్యంలో దాశరథి అనేక ప్రక్రియల్లో కృషి చేసాడు. కథలు, నాటికలు, సినిమా పాటలు, కవితలు రాసాడు. నిజాం పాలనలో రకరకాల హింసలనుభవిస్తున్న తెలంగాణాను చూసి చలించిపోయాడు. పీడిత ప్రజల గొంతుగా మారి నినదించాడు. రైతుదే తెలంగాణము రైతుదే.ముసలి నక్కకు రాచరికంబు దక్కునే అని గర్జించాడు. దగాకోరు బటాచోరు రజాకారు పోషకుడవు, దిగిపొమ్మని జగత్తంత నగారాలు కొడుతున్నది, దిగిపోవోయ్‌, తెగిపోవోయ్‌ అని నిజామును సూటిగా గద్దిస్తూ రచనలు చేసాడు.
 
నిరంకుశ నిజాము పాలన గురించి.. ఓ నిజాము పిశాచమా, కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ ఎముకల్‌ మసిచేసి పొలాలు దున్ని భోషాణములన్‌ నవాబునకు స్వర్ణము నింపిన రైతుదే తెలంగాణము రైతుదే.
 
ఆంధ్రమహాసభలో చైతన్యవంతమైన పాత్ర నిర్వహించి నిజాం ప్రభుత్వం చేత జైలు శిక్ష అనుభవించాడు. నిజామాబాదులోని ఇందూరు కోటలో ఆయన్ని మరో 150 మందితో ఖైదు చేసి ఉంచింది నిజాము ప్రభుత్వం. ఆయనతోపాటు ఖైదులో వట్టికోట ఆళ్వారుస్వామి కూడా ఉన్నాడు. పళ్ళు తోముకోవడానికిచ్చే బొగ్గుతో జైలు గోడల మీద పద్యాలు రాసి దెబ్బలు తిన్నాడు. మంచి ఉపన్యాసకుడు. భావప్రేరిత ప్రసంగాలతో ఊరూరా సాంస్కృతిక చైతన్యం రగిలించాడు. ఆంధ్ర సారస్వత పరిషత్తు నిర్మాతల్లో ఒకడు. 1953లో తెలంగాణ రచయితల సంఘాన్ని స్థాపించి అధ్యక్షుడుగా జిల్లాల్లో సాహితీ చైతన్యాన్ని నిర్మించాడు. ఆంధ్రప్రదేశ్‌ ఆస్థాన కవిగా 1977 ఆగష్టు 15 నుండి 1983 వరకు పనిచేసాడు. రాష్ట్ర, కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతులు గెల్చుకున్నాడు. అనేక సినిమాలకు గీతాలు రచించి అభిమానుల్ని సంపాదించుకున్నాడు. మీర్జాగాలిబ్‌ ఉర్దూ గజళ్ళను తెలుగులోకి గాలిబ్‌ గీతాలు పేర అనువదించాడు. తల్లి మీద, తల్లి తెలంగాణ మీద ఆయన రచించిన పద్యాలు ఇప్పటికీ ఎందరికో ఉత్తేజాన్ని కలిగిస్తున్నాయి. 1987 నవంబరు 5 న దాశరథి మరణించాడు.
 
చిత్ర పరిశ్రమకు దాశరధి ఆగమనం
'ఇద్దరు మిత్రులు' చిత్రం ద్వారా సుప్రసిద్ధ గేయ రచయిత చిత్రపరిశ్రమకు పరిచయం అయ్యారు. ఆయనే దాశరధి. ఈ పరిచయానికి పూర్వం దాశరధి తాను తెలుగులోకి అనువదించిన గాలీబ్‌ గేయాలను అక్కినేని నాగేశ్వరరావుకు అంకితం చేశారు. ఆ సభకు బూర్గుల రామకృష్ణారావుగారు అధ్యక్షత వహించారు. ఆ గేయ సంపుటిని మధుసూదనరావు చదివారు. ఆ శైలి ఆయనకు బాగా నచ్చింది. మీరు సినిమాలకు పాటలు వ్రాయకూడదా? అన్నారు మధుసూదనరావు. అందుకు సమాధానంగా ''నాకు సంగీత పరిజ్ఞానం లేదు కదా ఎలా?'' అన్నారు దాశరధి. ''అదంతా మేం చూసుకుంటాం. మీరు వ్రాస్తారా ?'' అన్నారు మధుసూదనరావు. ఒ.కె. అన్నారు దాశరధి.
 
ఆ మర్నాడు మద్రాసు ప్రయాణమయ్యారు. తొలిసారిగా సంగీత దర్శకుడు ఎస్‌.రాజేశ్వరరావుతో మ్యూజిక్‌ సిట్టింగ్‌లో పాల్గొన్నారు దాశరధి. ట్యూన్‌కు రాస్తారా ? లేక మీరు రాస్తే నేను ట్యూన్‌ కట్టుకోవాలా? అనడిగారు రాజేశ్వరరావు. ట్యూన్‌కు రాయటమంటే ఏమిటి? ఆశ్చర్యంగా అడిగారు దాశరధి. అంటే 'నేను 'సరిగమలు' వ్రాసి ఇస్తే దాని ప్రకారం మీరు పదాలు వేయటం ఒక పద్ధతి. మీరు వ్రాస్తే దానికి నేను ట్యూన్‌ కట్టుకోవటం రెండవ పద్ధతి. ఈ రెంటిలో ఏది మీకు ఈజీ చెప్పండి' - అన్నారు రాజేశ్వరరావు. సరే మీరే ట్యూన్‌ ఇవ్వండి. రాస్తాను. ఛాయిస్‌ రాజేశ్వరరావు గారికే ఇచ్చారు దాశరధి.
 
ట్యూన్‌ ఇచ్చి అలా తమలపాకు బిగిద్దామని వెళ్లారు రాజేశ్వరరావు. పది నిముషాల్లో తిరిగి వచ్చేసరికి 'రెడీ' అన్నారు దాశరధి. అప్పుడేనా? అని ఆశ్యర్యపోతూనే హార్మోనియంలో రాగాలాపన చేసి సరిచూసుకున్నారు రాజేశ్వరరావు. ఆయన ఆశ్చర్యానికి అంతులేదు. వెంటనే చరణాలకు ట్యూన్‌ ఇచ్చి ఇలా పక్కకు వెళ్లి మధుసూదనరావు చెవులో గుసగుసగా చెప్పారు.
 
''అమ్మో ! ఈయన అఖండుడండీ. నేను ఇచ్చింది చాలా కష్టమైన ట్యూన్‌. పది నిముషాల్లో రాసి పడేసారంటే నమ్మండి'' అంటూ తెగ మెచ్చుకున్నారు రాజేశ్వరరావు. ఈవిధంగా దాశరధి కలం నుండి జాలువారిన తొలి సినిమా పాట 'ఖుషీఖుషీగా నవ్వుతూ చెలాకి మాటలు రువ్వుతూ', 'పాడవేల రాధికా' అంటూ సాగింది. ''ఖుషీ ఖుషీగా నవ్వుతూ'' పాట ట్యూన్‌ ఒక ఇంగ్లీషు ఆల్బమ్‌ నుండి తీసుకున్నారు రాజేశ్వరరావు గారు. హైదరాబాద్‌లో ఉంటూ ఇక్కడి 'ఖవ్వాలి' పాటల తీరుతెన్నులు తెలిసిన వారు కావటంతో చిత్రంలోని ఒక ఖవ్వాలి పాటను కూడా ఆయనతో వ్రాయించారు. ''నవ్వాలి నవ్వాలి నీ నవ్వులు నాకే ఇవ్వాలి'' అన్న ఈ పాట ''ఇద్దరు మిత్రులు'' చిత్రంలోని తొలి పాట. అలా ఆయన వెండితెరపై గీతాలను శ్రోతలకు రుచి చూపించారు.

Share this Story:

Follow Webdunia telugu