Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాజేష్ ట‌చ్‌రివ‌ర్‌ దర్శకత్వంలో వివాదాస్పద సినిమా - దహిణి

Advertiesment
Rajesh Touchriver
, శుక్రవారం, 22 అక్టోబరు 2021 (18:00 IST)
Dahini movie still
తన్నిష్ఠ ఛటర్జీ, జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో జాతీయ పురస్కార గ్రహీత, ప్రముఖ దర్శకుడు రాజేష్ ట‌చ్‌రివ‌ర్‌ తెరకెక్కించిన సినిమా 'దహిణి'. ఆషిక్ హుస్సేన్, బద్రుల్ ఇస్లాం, అంగన రాయ్, రిజు బజాజ్, జగన్నాథ్ సేథ్, శృతి జయన్ దిలీప్ దాస్‌, దత్తాత్రేయ ఇందులో ఇతర తారాగణం. ఓరియన్ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్, సన్‌టచ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను పద్మశ్రీ అవార్డు గ్రహీత, మానవతావాది సునీత కృష్ణన్, ప్రదీప్ నారాయణన్ సంయుక్తంగా నిర్మించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
 
వాస్తవ ఘటనలు ఆధారంగా రాజేష్ ట‌చ్‌రివ‌ర్‌ సినిమాలు తీస్తుంటారు. దర్శకుడిగా ప్రయాణం ప్రారంభించినప్పటి నుండి ఆయనది అదే పంథా. గతంలో ఎన్నో సమస్యలను సినిమాల ద్వారా ఆయన వెలుగులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు 'విచ్ హంటింగ్' పేరుతో పలు రాష్ట్రాలలో జరుగుతున్న దారుణాలను వెలుగులోకి తీసుకురావాలనే ప్రయత్నంతో వివాదాస్పద అంశాలను స్పృశిస్తూ 'దహిణి' తెరకెక్కించారు. 
 
మంత్రగత్తెలుగా భావించి
ఒరిస్సాలోని మయూర్ బంజ్ జిల్లా, పరిసర ప్రాంతాల్లో జరిగిన యథార్థ ఘటన ఆధారంగా, వాస్తవికతకు దగ్గరగా 'దహిణి' చిత్రాన్ని రూపొందించారు. ఈ కథను అధ్యయనం చేస్తున్న సమయంలో తెలిసిన విషయాలు చిత్రబృందంలో ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ప్రేక్షకులను కూడా ఆశ్చర్యానికి గురి చేయడం ఖాయం. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) ప్రకారం మన దేశంలో 2001 నుండి 2019 వరకు దాదాపు 2937 మంది మంత్రవిద్యలు చేస్తున్నారనే అనుమానంతో దారుణంగా చంపబడ్డారు. కేవలం 2019 సంవత్సరంలోనే 102 మందిని మంత్రగత్తెలుగా భావించి వివిధ గ్రామాల ప్రజలు అత్యంత కిరాతంగా చంపారు. ఇటువంటి దురాగతాలపై ఎటువంటి కేసు లేదనే చెప్పాలి. ఒడిశా హైకోర్టు 2021లో చెప్పినదాని ప్రకారం... ప్రతి నెల నలుగురు మహిళలు మంత్రవిద్య చేస్తున్నారనే నెపంతో దారుణంగా హత్యకు గురవుతున్నారు. ప్రభుత్వ లెక్కలను పరిశీలిస్తే హత్యకు గురవుతున్నవాళ్లలో మహిళలే ఎక్కువ శాతం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక యునైటెడ్ నేషన్స్ అందించిన నివేదిక 1987 నుంచి 2003 మధ్యన సుమారు పాతికవేల మందిని మంత్రగత్తెలనే అనుమానంతో దారుణంగా చంపారని నిర్ధారణ చేసింది. 
 
మన దేశంతో పాటు పలు దేశాలను పట్టి పీడిస్తున్న 'విచ్ హంటింగ్' సమస్యను వెలుగులోకి తీసుకు రావాలని  మానవ హక్కుల ఆందోళన, లింగ ఆధారిత హింసను ప్రస్తావిస్తూ రాజేష్ టచ్ రివర్ ' దహిణి' సినిమాను రూపొందించారు. 
 
మానవ హక్కుల కార్యకర్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత సునీత కృష్ణన్ మాట్లాడుతూ "ఆధునిక కాలంలో కూడా లింగ ఆధారిత హింసతో, ఇప్పటికీ అనాగరిక చర్యలను ఆచరిస్తున్నాము. ఇది మానవ హక్కుల ఉల్లంఘన అయినప్పటికీ ఎవ్వరూ ఈ దారుణాన్ని అంగీకరించక పోవడం మన దురదృష్టం. ఈ వాస్తవాలను అందరికీ తెలియజేయడానికి, అలాంటి శతాబ్దాల క్రూరత్వాన్ని అంతం చేయడానికి, సమష్టి స్వరాన్ని సృష్టించడానికి మేం చేసిన ప్రయత్నం ఈ సినిమా” అని అన్నారు. 
 
నిర్మాత ప్రదీప్ నారాయణన్ మాట్లాడుతూ "అమాయకులైన వేలాది మంది మహిళలను ఇప్పటికీ మన దేశంలోని పలు ప్రాంతాలలో విచ్ హంటింగ్ పేరుతో అమానుషంగా ఎలా మట్టుపెడుతున్నారు? అనే క్రూరమైన వాస్తవికతను బహిర్గతం చేసే ఒక అద్భుతమైన  ప్రయత్నంతో ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రంలో భాగం కావడం నా అదృష్టం" అని చెప్పారు.
 
ఈ  చిత్రానికి పీఆర్వో: సురేంద్ర కుమార్ నాయుడు - ఫణి కందుకూరి (బియాండ్ మీడియా), సినిమాటోగ్రాఫర్: నౌషాద్ షెరీఫ్, ప్రొడక్షన్ డిజైనర్: సునీల్ బాబు, సౌండ్ డిజైనర్: అజిత్ అబ్రహం జార్జ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: జార్జ్ జోసెఫ్, ఎడిటింగ్: శశి కుమార్, మాటలు: రవి పున్నం, స్పెషల్ మేకప్ డిజైన్ ఆర్టిస్ట్: ఎన్‌జి రోషన్, స్వరాలు: డాక్టర్ గోపాల్ శంకర్‌, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రాజేష్ టచ్ రివర్

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సర్కారు వారి పాట బాణీల కూర్పు పూర్త‌యిదంటున్న థ‌మ‌న్‌