సినిమా థియేటర్లు రీఓపెనింగ్ చేసుకునేలా జీవో ఇవ్వడంతో పాటు సినీ ఇండస్ట్రీకి లాభం చేకూర్చేలా పలు నిర్ణయాలు ప్రకటించినందుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు తెలుగు ఇండస్ట్రీ తరపున తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ధన్యవాదాలు తెలిపింది. చిన్న సినిమాలకు జీఎస్టీ రీయింబర్స్‌మెంట్ ఇచ్చినందుకు.. థియేటర్లు ఇష్టప్రకారం షోలు పెంచుకునేందుకు సినిమా టికెట్ల ధరను మార్పులు చేస్తూ పెంచుకునే వీలును కలిగిస్తూ పలు నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా సినీ కార్మికులకు రేషన్, హెల్త్ కార్డులు ఇస్తామని హామీ ఇచ్చారు.
ముఖ్యంగా 1500 ఎకరాల్లో సినిమా ఇండస్ట్రీకి ఇస్తున్నట్టు ప్రకటించిన సందర్భంగా తెలుగు సినిమా యావత్ పరిశ్రమ ఆయనకు కృతజ్ఞతలు తెలిపింది. నిర్మాతల మండలి, మా అసోసియేషన్, దర్శకుల సమాఖ్య ఇలా సినిమాకు సంబందించిన 24 క్రాఫ్ట్స్ సమక్షంలో మంగళవారం ఫిలిం ఛాంబర్లో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసారు.
ఈ కార్యక్రమంలో సౌత్ ఇండియ ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షులు, నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతు .. ఈ రోజు సినిమా ఇండస్ట్రీ కి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మేనిఫెస్టో ఇచ్చారు. నిజానికి ఇది జిఎచ్ఎంసి మేనిఫెస్టోలో అనౌన్స్ చేసినప్పటికీ ఇది సినిమా ఇండస్ట్రీ మేనిఫెస్టో. ఎన్ శంకర్ గారు మొదట ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్లారు. అప్పుడే అయన 2000 ఎకరాల్లో సినిమా ఇండస్ట్రీ ఎలా ఉండాలో చెప్పారు కేసీఆర్ గారు.
ఆ తరువాత కొన్ని రోజులకు చిరంజీవి గారు, నాగార్జున గారు, తెలుగు ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ , ఇండస్ట్రీ తరపున శ్రీనివాస్ యాదవ్ గారు ఏంతో కృషి చేసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడారు.. ఆయన రెండు గంటలపాటు మాతో మాట్లాడడం నిజంగా మాకే షాక్ కలిగించింది. ఒక ముఖ్యమంత్రి అంత సేపు మాట్లాడడం అన్నది ఎక్కడ జరిగి ఉండదు. కానీ ఆయన అంతసేపు పరిశ్రమకు సంబందించిన విషయాలు తెలుసుకున్నారు.
కరోనా సమయంలో థియేటర్స్ తెరిచేంత వరకు కూడా కరెంట్ బిల్లులను మినిమం ఛార్జీలు కూడా లేకుండా చేయడం. రెండు నెలలు, మూడు నెలలు కాకుండా ఎప్పుడు థియేటర్స్ తెరిస్తే అప్పడి వరకు ఆ వెసులుబాటు కల్పించారు. అలాగే పెద్ద సినిమాకు ఎంత ఉపయోగమో, చిన్న సినిమాకు అంతే ఉపయోగం. ఇక్కడ చిన్న సినిమా, పెద్ద సినిమా అనేది లేదు. అంతా ఒక్కటే, అందరికి సమానంగా అవకాశం ఉంటుంది. అలాగే షోస్ పెంచుకోవడానికి అవకాశం ఇవ్వడం, టికెట్స్ రేట్ విషయంలో నచ్చిన తీరుగా పెంచుకునే అవకాశం కల్పించారు. దానికి తోడు టికెట్ రీఎంబర్స్మెంట్ కలిగించడం మంచి పరిణామం.
వెస్ట్ బెంగాల్‌లో ఈ రీఎంబర్స్‌మెంట్ ఉంది. అయితే అది ప్రేక్షకుడికి అందుతుంది. కానీ ఇక్కడ నిర్మాతకు అందేలా చేస్తున్నారు. అది చిన్న నిర్మాతలకు చాలా హెల్ప్ అవుతుంది. దాని ద్వారా చాలా సినిమాలు మొదలవుతాయి. అలా మొదలయితే ఎంతమందికో పని దొరికి కృష్ణానగర్ కళకళలాడుతుంది. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పనులన్నీ కూడా సింగిల్ విండో ద్వారా చేయడమని చెప్పారు. దాని ద్వారా పనులన్నీ తొందరగా పూర్తవుతాయని నమ్మకం ఉంది.
ఫిలిం ఇండస్ట్రీకి ఇన్ని వరాలు ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని సినిమా ఇండస్ట్రీ తరపున అన్ని క్రాఫ్ట్స్ కలిసి పెద్ద కార్యక్రమం నిర్వహించి ఆయనను గ్రాండ్ గా సన్మానించుకుంటాం. ఇక్కడ రెండు రాష్ట్రాలు ఏర్పడి సినిమా ఇండస్ట్రీకి ఇద్దరు తండ్రులు అయిపోయారు. కాబట్టి ఇదే వేదికపై ఆంధ్రా సీఎంని కూడా పిలిచి సన్మానించుకుంటాం. ఆంధ్రా సీఎంతో కూడా సినిమా ఇండస్ట్రీ అభివృద్ధికి కావలసిన పనులు అడుగుతాం. తప్పకుండా ఆయన సపోర్ట్ అందిస్తారని కోరుకుంటున్నాం అన్నారు.
తెలంగాణ స్టేట్ ఛాంబర్ ప్రెసిడెంట్ మురళి మోహన్ మాట్లాడుతూ, అపర భగీరధుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఆయన ఏ విషయంలోనైనా కూలంకషంగా తెలుసుకున్న తరువాతే దాని గురించి నిర్ణయం తీసుకుంటారు. సినిమా పరిశ్రమ విషయంలో కూడా అన్ని విషయాలు స్టడీ చేసి ఇండస్ట్రీ కోసం చాలా కోరికలు నెరవేర్చినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు.
మా అసోసియేషన్ సెక్రెటరీ జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ, సినిమా పరిశ్రమ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నో వరాలు ఇచ్చారు. నిజంగా ఆయన పరిశ్రమ కోసం ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు ఆయనకు నా ప్రత్యేక కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నాం. తప్పకుండా కేసీఆర్ గారు చెప్పింది చేస్తారు. ఆయనకు మా అసోసియేషన్ తరపున స్పెషల్ థాంక్స్ అన్నారు.
ఫిలిం ఫెడరేషన్ ప్రసిడెంట్ కొమరం వెంకటేష్, ఈ రోజు నాకు 24 క్రాఫ్ట్‌కు సంబంధించి చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, అలాగే చిరంజీవిగారు, నాగార్జున గారికి స్పెషల్ థాంక్స్ చెబుతున్నాను. ఈమధ్యే వాళ్ళు అందరిని పిలిచి సినిమా పరిశ్రమలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఫెడరేషన్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. వాటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే ఇంకో ముఖ్య విషయం చెప్పాలి ఏమిటంటే.. ఇల్లు లేని కార్మికులు చాలామంది ఉన్నారు. షూటింగ్ సరిగా లేకుండా రెంటు కట్టుకోలేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు, అలాంటి వాళ్ళకోసం ఇల్లు కట్టిస్తే బాగుటుంది అని కోరుకుంటున్నాను అన్నారు.
ప్రముఖ నిర్మాత సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ .. ముఖ్యమంత్రి గారు డైనమిక్ గా అన్ని ఇచ్చేసారు .. అలాగే ఇంకా ఏమైనా సమస్యలు ఉంటె వాటిని చెప్పండి అని అడిగారు .. ఇప్పుడు ఫెడరేషన్ వాళ్ళు చెప్పినట్టు కార్మికుల కోసం ఇల్లు కూడా వచ్చే ఏర్పాటు చేస్తాం. సినిమా ఇండస్ట్రీ కోసం ఇన్ని చేసిన డైనమిక్ ముఖ్యమంత్రి ఒక్క కేసీఆర్ గారే అన్నారు.