సామాన్య ప్రేక్షకుడిపై ప్రభుత్వం జీవో రూపంలో భారం వేసినందుకు తెలంగాణ ఎగ్జిబిటర్లు ఆనందంలో వున్నారు. కరోనా వల్ల దాదాపు ఏడాదిపాటు థియేటర్లలో సినిమాలు విడుదలకాకపోవడంతో ఎగ్జిబిటర్లు ఒకదశలో ఆందోళనకు గురయ్యారు. థియేటర్లలో సిబ్బందిని తగ్గించేయడం, జీతాలు కుదించడం వంటి ప్రక్రియలు వాటంతటవే జరిగిపోయాయి. ఇక కోవిడ్ రెండో దశ తర్వాత థియేటర్లు ఓపెన్ చేసుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా, తమ సమస్యలు ఇంకా అలాగే వున్నాయంటూ ఇటీవలే తెలంగాణ ఛాంబర్ ఆధ్వర్యంలో సినిమా మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ను కలిసి వినతి ప్రతం సమర్పించారు.
అందులో థియేటర్ల మూసేసిన కాలంలో కరెంట్ చార్జీలకు రాయితీ ఇవ్వాలి. కొన్ని ప్రాంతాలలో అసలు రద్దుచేయాలి. అలాగే సినిమా టిక్కెట్ రేటు పెంచుకోవాలి. వినోదపన్నులో రాయితీ ఇవ్వాలంటూ రకరకాల డిమాండ్లు అందులో పొందుపరిచారు. దానిలో భాగంగా మల్టీప్లెక్స్, మామూలు థియేర్టలో కేంటిన్ సమస్యలు, పార్కింగ్ ఫీజు వసూలు చేయించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించిన చర్చలు మంగళవారంనాడు సినీ పెద్దల సమక్షంలో మంత్రి జరిపారు. దాని సారాంశం ప్రకారం థియేటర్లలో పార్కింగ్ ఫీజును ప్రేక్షకులనుంచి వసూలు చేయవచ్చని ప్రబుత్వం జీవో ఇచ్చింది. జీవో నెం.63, 1918 సెక్షన్ కింద తక్షణమే అమలు జరుగుతుందని స్టేట్ మెంట్ ఇచ్చింది.
ఈ జీవోతో తెలంగాణ ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి సునీల్ నారంగ్ ఆనందంతో ఓ వీడియో విడుదల చేశారు. పార్కింగ్ ఫీజు విషయంలో తమకు సహకరించిన కె.సి.ఆర్. కెటి.ఆర్. సంబంధిత అధికారులకు ధన్యవాదాలు తెలుపుతూ, జై తెలంగాణా అంటూ నినాదం చేశారు.