తగ్గేదేలే అంటూ ముందుకు సాగుతున్న బన్నీ
పుట్టినరోజు ప్రత్యేక కథనం
అల్లు అర్జున్ ఈ పేరు అటు మెగాస్టార్ ఫ్యామిలీలోనూ ఇటు అభిమానులు, యూత్‌లోనూ ఒక ఐకాన్ అని చెప్పాలి. గంగోత్రి నుంచి నటుడిగా కెరీర్‌ను ప్రారంభించి అసలు ఇతను హీరోగా నిలబడతాడా! అని చెవులు కొరుక్కున్న సినీపరిశ్రమగానీ, బయట వ్యక్తులుకానీ ఈ సినిమాతో ఇంతేసంగతి అనుకునేవారు. అంతకుముందు చిరంజీవి విజేతలో బాలనటుడిగా, స్వామిముత్యంలో బాలనటుడిగా చేసిన పెద్దగా గుర్తుకురాలేదు జనాలకు. ఒక్కసారిగా గంగోత్రినుంచి హీరో అనగానే అందరూ గుసగుసలాడుకున్నారు.
అలాంటి స్థితినుంచి మామయ్య మెగాస్టార్‌నుంచి పుణికిపుచ్చుకున్న స్పూర్తితో డాన్స్‌లో సరికొత్త పోకడలు నేర్చుకుంటూ ఆయనకు ధీటుగా నిలిచాడు. ఆ తర్వాత సినీ హీరోగా ఆర్యతో మొదటి స్టెప్ వేసి స్టయిలిష్గా మారిపోయాడు. అనంతరం మొదలుపెట్టిన పరుగు, జులాయి, వేదం, డి.జె.తో కెరీర్ గ్రాప్ పెంచుకుంటూ అలవైకుంఠపురంలో సినిమాతో అందనంత ఎత్తు ఎదిగాడు. తెలుగు పరిశ్రమలో అల్లు అర్జున్ కాస్త దక్షిణాదిలో మలయాలంలో మల్లు అర్జున్‌గా పేరు తెచ్చుకున్నాడు. అలా వారి ఆదరణ పొందడం పూర్వజన్మ సుకృతమే అంటూ అర్జున్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఎంత మెగాస్టార్ బేక్‌గ్రౌండ్ వున్నా తగినంత కష్టం, అదృష్టం వుంటేనే ఈ రంగంలో వుంటామనే సంగతికూడా తాను ఎప్పుడూ మర్చిపోలేనని తరచూ అంటుండేవాడు.
అలా సుకుమార్ ఆర్యతో స్టయిలిస్ హీరోగా పేరుతెచ్చుకుని ఇప్పుడు అదే సుకుమార్‌తో ఐకాన్‌గా నిలవడానికి సిద్ధమయ్యాడు. పుష్ప సినిమాతో యూత్ ఐకాన్‌గా మారిపోయాడంటూ సుకుమార్ చేసిన వ్యాఖ్యతోపాటు అభిమానులు వంతపాడారు. పుష్ప టీజర్ వేడుకకే తమిళనాడు నుంచి కొందరు మహిళా అభిమానులు రావడం ప్రత్యేకమనే చెప్పాలి. అల్లు కెరీర్‌లో మాస్, క్లాస్, యూత్ ఫ్యామిలీ ఆడియెన్స్ ఇలా అందరినీ మెప్పిస్తూ ప్రస్తుతం దక్షిణాదిన అత్యంత విజయవంతమైన హీరోల్లో ముందు వరుసలో ఉన్నారు. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ జన్మదినం. ఆయనకు పుట్టినరోజు సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం.
ఆర్య నుంచి అలవైకుంటపురంలో వరకు ఆయన కెరీర్ చూసుకుంటే ఒక్కో సినిమాకు ఒక్కో మెట్టు ఎక్కేదిశగా కసరత్తు చేశాడు. తన కుటుంబంలోని శిరీష్‌కూడా అన్ననుచూసి ఎంతో నేర్చుకునేలా చేశాడనే కీర్తి పొందాడంటే అంతకన్నా ఏంకావాలి. శిరీష్‌ను మినహాయిస్తే మెగాకుటుంబంలోని నటవారసులుకూడా డాన్స్‌లోనూ స్టయిలిష్‌లోనూ అల్లు అర్జున్ ముందు తామెంత అనేలా చెప్పడం మరింత గౌరవదాయకం. పుట్టినింటనేకాకుండా అందుకు ఏమాత్రం తగ్గకుండా మలయాళంలోనూ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా అభిమాన సంఘాలున్నాలు, ఆదరణ వుండంటే అది మామూలు విషయం కాదు. అంతకుముందు యాక్షన్ కింగ్ అర్జున్ గురించి అక్కడ తెలియనివారు లేరు. కానీ ఆయన్ను కూడా మర్చిపోయేలా చేసిన వ్యక్తి అల్లు అర్జున్ అని చెప్పడం ఏమాత్రం సందేహంలేదు.
ఇక అభిమానులను తన స్వంతవారుగా చూసుకున్న సందర్భాలు చాలానే వున్నాయి. ఆమధ్య కరోనా సమయంలోనూ, ఇతరత్రా అభిమానుల కుటుంబంలో ఏర్పడినకొన్ని దుర్ఘటనలలోనూ తనే ముందుండి వారికి ఆసరగా మనో ధైర్యాన్ని సాయాన్ని అందించిన ఉదంతాలు వున్నాయి. నా జీవితంలో నేను సాధించిన అతిపెద్ద ఆస్తి అభిమానులే అంటూ ఆయన మురిసిపోతుంటారు.
వివాహం అయ్యాక అల్లు అర్జున్ మాత్రం ఫ్యామిలీకి సమయాన్నికేటాయిస్తుంటారు. అంతేకాకుండా తండ్రిని మించిన కొడుకుగా ఆయన కీర్తి సంపాదించుకున్నారు. అల వైకుంఠపురంలో విజయోత్సవ వేడుకలో బన్ని తన తండ్రి గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఎంత ఎదిగినా తన తండ్రి అంత గొప్ప స్థాయికి చేరుకోలేనని చెప్పి తండ్రికి గౌరవమిచ్చే మంచి కొడుకు అని నిరూపించుకున్నారు. అలాగే భార్య వచ్చాక ఎవరికైనా జీవితంలో మార్పు తెలుస్తుంది. అది నేను గ్రమించానని ఇటీవలే వెల్లడించాడు. అప్పటివరకు వున్న సమాజంపై వున్న కోణం ఆ తర్వాత ఆలోచనలు పూర్తిగా మారిపోతుంటాయి. అలా నన్ను నా భార్యే మార్చిందంటూ వ్యాఖ్యానించాడు. నా జీవితంలో ఆమె ప్రభావం ఎంతో ఉంది మంచి భర్త అనిపించుకున్నారు.
కుటుంబంతోకాకుండా తోటి హీరోలతోనూ కలుపుగోలుగా వుంటూ వారి సినిమా విడుదల తర్వాత అందులోని విషయాలు చర్చించుకుంటూ కలిసిపోతుంటాడు. పాత్రపరంగా రకరకాల ప్రయోగాలు చేశాడు. సిక్స్ పేక్‌ను కూడా దేశముదురుతో చూపించాడు. టాలీవుడ్‌లో మెగాస్టార్ తర్వాత అంతగా పాపులర్ అయింది పవన్ కళ్యాణ్ అయితే ఇప్పుడు అల్లు అర్జున్ అనే స్థాయికి చేరుకున్నాడు. అందరూ డాన్స్ బాగా వేస్తావని అంటుంటారు. కానీ నా డాన్స్‌లోనూ చాలా తప్పులుంటాయని ఇటీవలే ఓ వేడుకలో పేర్కొన్నాడు.
ఇక నిన్న జరిగిన పుష్ప టీజర్లోనూ నేను మీలాంటి మనిషినే. నాకూ బాధలు, కష్టాలు వుంటాయి. వెనుకడుగువేయాలా అని ఆలోచన వస్తున్నప్పుడల్లా.. తగ్గేదే లే.. అంటూ నాలో నేను అనుకుని ధైర్యంగా ముందగుడువేస్తాను. అలా వేయబట్టే నేడు ఈ స్థాయికి మీ ఆదరాభిమానాలను నోచుకోకలిగాను. ఆడపిల్లలుకూడా భయపడకండి. మీకంటూ స్వతంత్రం వుంది. మీరు కూడా తగ్గేదేలే. అంటూ ముందుకుసాగండని వారికి ధైర్యాన్ని నూరిపోశారు. ఇలా ఇప్పటివరకు ఏ హీరో చెప్పని విషయాన్ని చెప్పి వారికి మరింత దగ్గరయ్యాడు. ఏదిఏమైనా రాఘవేంద్రరావు ద్వారా హీరోగా మారిన అల్లు అర్జున్ ఇంతై వటుడింతై.. అన్నంతలా ఎదిగి నలుగురికి ఆదర్శంగా నిలిచాడు అల్లు అర్జున్.