తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నటుడు జయప్రకాష్ రెడ్డి మంగళవారం గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు కూడా గుంటూరులో మంగళవారం సాయంత్రమే పూర్తి చేశారు. జేపీ మృతిపట్ల టాలీవుడ్ ఇండస్ట్రీ తీవ్ర తిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. అసలు జేపీ చనిపోయారంటే.. టాలీవుడ్ సినీ ప్రముఖులు ఎవరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి అయితే.. అపుడే మమ్మల్ని వదిలి వెళ్లిపోయావా మిత్రమాంటూ ట్వీట్ చేశారు. జేపీ లేని లోటును తీర్చలేమని వ్యాఖ్యానించారు. పైగా, ఆయన మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, అలాగే, అనేక మంది రాజకీయ సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలిపారు.
ఈ క్రమంలో తెలుగు సీనియర్ హీరో బాలకృష్ణ సైతం జేపీ మృతిపై స్పందించారు. మంచి ఆత్మీయుడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో చిత్రాలలో ఇద్దరం కలిసి నటించామని చెప్పారు. సినీ రంగాన్ని, నాటక రంగాన్ని రెండు కళ్లుగా భావించేవారని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. అలాగే, జేపీ కుటుంబానికి బాలయ్య రూ.10 లక్ష ఆర్థిక సాయం చేసినట్టు వార్తలు వస్తున్నాయి.
అయితే, ఈ విషయాన్ని బాలయ్య అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు. బాలయ్యతో కలిసి జయప్రకాష్ రెడ్డి పలు చిత్రాల్లో నటించారు. వీరిద్దరు కలిసి నటించిన నరసింహానాయుడు, సమరసింహారెడ్డి, చెన్నకేశవరెడ్డి వంటి అనేక చిత్రాలు ఉన్నారు.