Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాలకృష్ణ మాటలు వింటే ఎవరైనా అమాంతం మూర్ఛపోవలసిందే... నట..!

ఎవరికోసమైతే అభిమానులు కొట్టుకు చస్తున్నారో లేక నిజంగానే చంపుకు చస్తున్నారో ఆ హీరోలు మాత్రం గిల్లికజ్జాలు మాని హాయిగా ఒకరినొకరు పొగడ్తలతో ఉబ్బేసుకుంటూ సాగుతుండటం చూసయినా తెలుగు హీరోల అభిమానులకు బుద్ధి రాదా అనేది చాలా కాలంలో తలెత్తుతున్న ప్రశ్న.

బాలకృష్ణ మాటలు వింటే ఎవరైనా అమాంతం మూర్ఛపోవలసిందే... నట..!
హైదరాబాద్ , ఆదివారం, 22 జనవరి 2017 (03:44 IST)
రాజును మించిన రాజభక్తి చూపటంలో మన తెలుగు హీరోల అభిమానులను మించిన వారు మరెక్కడా ఉండరన్నది అతిశయోక్తి కాదు. అభిమాన హీరో సినిమా విడుదల అవుతోందంటే చాలు ఆ హీరోగారికి పాలాభిషేకాలు, నిలువెత్తు కటౌట్లతో మాత్రమే సరిపెట్టుకోరు వీరు. తమ హీరోపట్ల భక్తి చూపించే పేరుతో అవతల ఉన్న హీరో సినిమాల పోస్టర్లపై పేడ కొట్టడం మనవాళ్లకు తెలిసినంతగా దేశంలో మరే భాషా ప్రాంత సినిమారంగలోనూ లేదు. కానీ ఎవరికోసమైతే అభిమానులు కొట్టుకు చస్తున్నారో లేక నిజంగానే చంపుకు చస్తున్నారో ఆ హీరోలు మాత్రం గిల్లికజ్జాలు మాని హాయిగా ఒకరినొకరు పొగడ్తలతో ఉబ్బేసుకుంటూ సాగుతుండటం చూసయినా తెలుగు హీరోల అభిమానులకు బుద్ధి రాదా అనేది చాలా కాలంలో తలెత్తుతున్న ప్రశ్న. 
 
తెలుగు సినిమా ప్రపంచం కూడా ప్రస్తుతం కులాల సంకుల సమరంగా మారిపోయిన తరుణంలో చిరంజీవికి, బాలకృష్ణకు సినిమా పరంగా పచ్చగడ్డి వేయకున్నా భగ్గుమనేంత భీతావహ పరిస్థితి ప్రబలిపోయి ఉంది. కానీ అటు కలెక్షన్ల పరంగా, ప్రాచుర్యం రీత్యా అద్భుత విజయం సాధించాయని చెప్పుకుంటున్న గౌతమీపుత్ర శాతకర్ణి,  ఖైదీ నంబర్ 150 సినిమాల్లో నటించిన హీరోలు బాలకృష్ణ, చిరంజీవిల అన్యోన్య దాంపత్యం గురించి వింటే అభిమానులు తప్ప ఎవరైనా మూర్ఛపోవలసిందే మరి. 
 
అభిమాన హీరో సినిమా తొలి రోజు, తొలి ఆటకు టికెట్ కొని చూడకపోతే బతుకే వ్యర్థం అనుకుని గొంతు కోసుకోవడానికి కూడా సిద్ధపడుతున్న మూర్ఖాభిమానులు రాజ్యమేలుతున్న రోజుల్లో ఈ కింది కథనం వింటే ఎంతవారికైనా మూర్ఛ రావడం తథ్యం. 
 
ఈ సంక్రాంతికి మెగాస్టార్‌ చిరంజీవి ‘ఖైదీ నెంబర్‌ 150’తోనూ, నందమూరి బాలకృష్ణ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’తోనూ ప్రత్యర్థులుగా బరిలోకి దిగారు. దీంతో వారి వారి అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా పెద్ద యుద్ధమే చేశారు. ఎట్టకేలకు రెండు సినిమాలూ ఘనవిజయాలు సాధించడంతో ఇద్దరి హీరోల అభిమానులూ శాంతించారు. 
 
తాజాగా చిరంజీవి గురించి ఓ విషయం చెప్పి అభిమానులను ఆశ్చర్యపరిచాడు నందమూరి బాలకృష్ణ. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి తప్ప తనకు సినీ ఇండస్ట్రీలో సన్నిహిత మిత్రులెవరూ లేరని చెప్పాడు. 
 
‘తెలుగు సినీ పరిశ్రమలో నాకు చిరంజీవి ఒక్కడే క్లోజ్‌ఫ్రెండ్‌. సంక్రాంతి పండుగ సమయంలో సినిమాల మధ్య పోటీ సహజమే. పోటీ ఉంటేనే మన ప్రతిభ బయటపడుతుంది. మా ఇద్దరి మధ్యనా ఉన్నది వృత్తిపరమైన పోటీ మాత్రమే. వ్యక్తిగతంగా మేము మంచి స్నేహితులమ’ని బాలయ్య చెప్పాడు. బాలయ్య వ్యాఖ్యలతో ఇప్పటికైనా అభిమానుల్లో మార్పు వస్తుందని ఆశిద్దాం.
 
అభిమానుల్లో మార్పు వస్తే వాళ్లు అభిమానులు ఎలా వస్తారంటూ ఒక కొంటెకోణంగి సమాధానం.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ.376.14 కోట్లు వసూలు చేసిన అమీర్ ఖాన్ దంగల్.. వినోదపు పన్ను కట్..