తెలుగు చిత్రపరిశ్రమపై సీనియర్ నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను దళితుడుని అని తెలిసిన తర్వాతే తనకు సినిమా అవకాశాలు బాగా తగ్గిపోయాయని తెలిపారు. ఈ వ్యాఖ్యలు చిత్రపరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి.
నటుడుగా, హీరోగా, సహాయ నటుడుగా వందల సినిమాల్లో నటించిన బాబు మోహన్.. కొన్నేళ్లపాటు ప్రేక్షకుల మన్నలు పొందారు. ఆ తర్వాత రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. అయితే, ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బాబు మోహన్ సినీ పరిశ్రమలో కుల వివక్ష ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే.
తాను దళితుడుని అని చాలా మందికి తెలియదన్నారు. పైగా, ఈ విషయాన్ని తాను ఎన్నడూ బయటపెట్టలేదన్నారు. కానీ, ఎపుడైతే తాను రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత తన కులం బహిర్గతమైందన్నారు. అప్పటి నుంచి బాబు మోహన్ దళితుడా అంటూ ఆశ్చర్యకర కామెంట్స్ వినిపించేవన్నారు. ఇదే కారణంతో నాకు వచ్చే సినిమా ఆఫర్లు తగ్గిపోయాయని తెలిపారు. తనను దూరం పెట్టడం మొదలుపెట్టారని, సినీ పరిశ్రమలో ప్రతిభకు బదులు కులానికే ప్రాధాన్యత ఉంటుందని బాబు మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు.