'బహుబలి-2' ఆరు ఆటలు.. ఉదయం 7 గంటల నుంచి అర్థరాత్రి 2.30 గంటల వరకు...
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, హీరోలు ప్రభాస్, రానాలు నటించిన చిత్రం బాహుబలి. ఈ చిత్రం రెండో భాగం ఈనెల 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రం కోసం సినీ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, హీరోలు ప్రభాస్, రానాలు నటించిన చిత్రం బాహుబలి. ఈ చిత్రం రెండో భాగం ఈనెల 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రం కోసం సినీ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే, ఈ చిత్రానికి ఉన్న విపరీతమైన క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని 'బాహుబలి-2' సినిమాను తొలి 10 రోజుల పాటు ఉదయం 7 గంటల నుంచి అర్థరాత్రి 2.30 వరకు మొత్తం 6 షోలు ప్రదర్శించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ప్రస్తుతం సాధారణంగా రోజూ నాలుగు షోలు మాత్రమే సినిమాలు ప్రదర్శిస్తున్నారు. కానీ, బాహుబలి-2 సినిమా విషయంలో అదనంగా రెండు షోలు కలిపి రోజుకు ఆరు షోలు ప్రదర్శించుకొనేందుకు అనుమతివ్వాలని పలువురు డిస్ట్రిబ్యూటర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీన్న పరిశీలించిన హోంశాఖ అధికారులు, ప్రభుత్వం, డిస్ట్రిబ్యూటర్‌తో మాట్లాడారు. అధిక రద్దీ వల్ల తొక్కిసలాటతోపాటు బ్లాక్ టికెట్ల విక్రయాలను నివారించేందుకు అదనపు షోలు అనుమతించడం ఒక మార్గమని భావించిన హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఏ.ఆర్.అనూరాధ ఉత్తర్వులు జారీ చేశారు.
దీంతో ఈ నెల 28 నుంచి మే 7వ తేదీ వరకు పది రోజుల పాటు రోజుకు ఆరు ఆటలు చొప్పున ప్రదర్శించేందుకు అనుమతి ఇచ్చారు. అయితే, ఈ అదనపు షోలకు సంబంధించి ప్రభుత్వానికి వినోదపు పన్ను చెల్లించాలని హోంశాఖ ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొన్నారు.