యువ కథనాయకుడు అశోక్ గల్లా మానవతా దృక్పథంతో తన వంతు సాయం చేశారు. తీవ్రమైన ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఒక మీమర్ కు వైద్య ఖర్చుల కోసం రూ.2 లక్షలు విరాళంగా అందించారు. ఏప్రిల్ 5వ తేదీన తన జన్మదినం సందర్భంగా అశోక్ గల్లా తన మంచి మనసుతో చేసిన ఈ గొప్ప పని.. ఇటీవల తెలుగుడిఎంఎఫ్‌లో చేరిన మీమర్స్ కమ్యూనిటీకి భరోసాను ఇస్తోంది. అశోక్ గల్లా జన్మదినాన్ని పురస్కరించుకుని తెలుగుడిఎంఎఫ్ ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన తన సాయాన్ని ప్రకటించారు.
అశోక్ గల్లా జన్మదినం సందర్భంగా ఆయన కథానాయకుడిగా నటిస్తున్న మూడవ చిత్రాన్ని ప్రకటించడం విశేషం. చిత్ర ప్రకటన, ఈ కార్యక్రమాన్ని మరింత సందడిగా మార్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాతో ఉద్భవ్ రఘునందన్ దర్శకునిగా పరిచయమవుతున్నారు. అలాగే "హ్యాపీ బర్త్‌డే" అంటూ అశోక్ గల్లాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ విడుదల చేసిన "ది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ"తో కూడిన అనౌన్స్ మెంట్ పోస్టర్ ఆకట్టుకుంటోంది.
మరోవైపు, ఇటువంటి కార్యక్రమాల ద్వారా ఆపదలో ఉన్న తమ సభ్యులకు సహకారం అందించాలని తెలుగుడిఎంఎఫ్ భావిస్తోంది. అలాగే తమ సభ్యులకు అన్ని రకాలుగా అండగా నిలుస్తూ వారి ఉజ్వల భవిష్యత్తును మెరుగైన బాటలు వేసే దిశగా నిబద్ధతతో అడుగులు వేస్తోంది. ఇటీవల, తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ (TeluguDMF) దాని వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. డిజిటల్ కంటెంట్ క్రియేటర్ల యొక్క సంక్షేమమే లక్ష్యంగా ఈ సంఘం ఏర్పడింది. సభ్యులకు వృత్తి పరంగా మెరుగైన అవకాశాలు కల్పించడంతో పాటు, ఆరోగ్య భీమా కూడా అందిస్తూ ఉన్నత ఆశయాలతో అడుగులు వేస్తోంది.