మెగాస్టార్ చిరంజీవి ఒకపుడు రాజకీయ నేత. ఆయన కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రిగా కూడా పని చేశారు. అయితే, ఆయనకు ఇపుడు పెద్ద ఊరట లభించింది. ఆయన గత 2014 ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ ఉత్తర్వులకు విరుద్ధంగా ప్రచారాన్ని రాత్రి 10 గంటల తర్వాత నిర్వహించారని, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారనే ఆరోపణలతో గుంటూరులోని అరండల్ పేట్ పోలీస్ స్టేషన్‌లో ఒక కేసు నమోదైంది.
ఈ కేసు ఎఫ్ఎస్ఐఆర్ ఆధారంగా గుంటూరు రైల్వే కోర్టులో జరుగుతున్న విచారణను హైకోర్టు నిలిపివేసింది. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు ఈ కేసుకు చెల్లుబాటుకావని స్పష్టం చేసింది. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. జరిమానా విధించాలన్న సహాయ పీపీ వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు.
2014 ఏప్రిల్ 27వ తేదీ రాత్రి 10 గంటల తర్వాత ఎన్నికల ప్రచారం చేశారని, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారని పేర్కొంటూ చిరంజీవిపై పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేశారు. పిటిషనర్ తరపున న్యాయవాది ఎ.స్వరూపా రెడ్డి వాదనలు వినిపించారు. ప్రచారం ముగించుకొని తిరిగి వస్తున్న పిటిషనర్‌పై అక్రమంగా కేసు నమోదు చేశారన్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగలేదన్నారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. చిరంజీవిపై నమోదు చేసిన కేసును కొట్టేస్తూ ఉత్తర్వులిచ్చారు.