తెలుగు దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి తన సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ప్రతిభపై సినీ ప్రముఖులే కాదు.. ఇతర రంగాల్లో వారూ ప్రశంసలు కురిపిస్తారు. తాజాగా ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రాకు రాజమౌళికి మధ్య ట్విటర్‌లో జరిగిన సంభాషణ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. సింధూ నాగరికతపై సినిమా తీయాలని కోరుతూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.
సింధూ నాగరికతకు సంబంధించిన ఫొటోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా 'ఇలాంటి చిత్రాలు మన చరిత్రకు జీవం పోస్తాయి. మన టాలెంట్‌ను ప్రతిబింభిస్తాయి. నాటి పరిస్థితులు ప్రపంచానికి తెలిసేలా వీటిపై ఒక సినిమా తీయగలరా..?' అని ట్వీట్ చేశారు.
దీనికి రాజమౌళిని ట్యాగ్ చేశారు. ఇక ఈ ట్వీట్‌కు రాజమౌళి రిప్లై ఇస్తూ 'మగధీర' నాటి సంగతులను గుర్తుచేసుకున్నారు. 'మేం మగధీర షూటింగ్‌ను ధోలావీరాలో చేశాం. ఆ సమయంలో అక్కడ ఉన్న ఓ చెట్టు నన్ను ఆకట్టుకుంది. దాన్ని ఆధారంగా సింధూ నాగరికత ఎలా అభివృద్ధి చెందింది? ఎలా అంతరించింది అని సినిమా తీయాలనే ఆలోచన వచ్చింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఓసారి పాకిస్థాన్ వెళ్లాను. అక్కడ మొహెంజొ దారొకు వెళ్లి రీసెర్చ్ చేయాలని ప్రయత్నించా. కానీ, నాకు అనుమతులు రాలేదు' అంటూ బాధతో కూడిన ఎమోజీని పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరలవుతోంది. నెటిజన్లు కూడా దీనిపై సినిమా తీయాలంటూ రాజమౌళిని రిక్వెస్ట్ చేస్తున్నారు.