డాక్యుమెంటరీ ఫిల్మ్ డైరెక్టర్ లీలా మణిమేగలై మరో అభ్యంతరకర పోస్టు చేశారు. ఇప్పటికే ఆమె విడుదల చేసిన ఓ పోస్టరుపై దేశ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. కాళిమాత సిగరెట్ తాగుతున్నట్టుగా ఆ పోస్టరు ఉంది. దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది. ఇపుడు ఈ దర్శకురాలు అభ్యంతరకర పోస్ట్ పెట్టారు.
దేవుళ్ల వస్త్రధారణలో ఉన్న వ్యక్తులు సిగరెట్ తాగుతున్న ఫొటోను ట్విటర్‌లో పోస్ట్ చేసిన లీనా.. 'ఎక్కడో మరోచోట' అనే పదాన్ని రాశారు. తాజా వివాదానికి కారణమైన కాళీ పోస్టర్ కోవలోనే ఈ ఫొటో ఉండటం గమనార్హం. కాళీ వివాదం విషయంలో తనపై పలు కేసులు నమోదైన నేపథ్యంలో.. తాజా పోస్ట్‌తో లీనా తన వాదనను సమర్థించుకునేయత్నం చేసింది.
తమిళనాడు రాష్ట్రంలోని మదురైకి చెందిన లీనా మణిమేగలై.. 'రిథమ్స్ ఆఫ్ కెనడా'లో భాగంగా 'కాళీ' పేరుతో ఓ డాక్యుమెంటరీ చిత్రీకరించారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను కెనడాలోని టొరంటోలోని ఉన్న అగాఖాన్ మ్యూజియంలో విడుదల చేశారు. అయితే, ఆ పోస్టర్ దేవతా మూర్తిని కించపరిచేలా ఉందని ఆరోపిస్తూ భారత్‌లో నిరసనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అందులోకి కాళీ చేతిలో సిగరెట్ కన్పించడం, వెనుకవైపు స్వలింగ సంపర్కుల జెండా వంటివి తీవ్ర వివాదానికి దారితీశాయి.
ఈ క్రమంలోనే ఆమె చేసిన పోస్ట్ మత విశ్వాసాలను దెబ్బతీసేలా ఉందంటూ పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. అటు కెనడాలోని భారత హైకమిషన్ కూడా దీన్ని తీవ్రంగా పరిగణించింది. దీంతో స్పందించిన అగాఖాన్ మ్యూజియం.. ఆ డాక్యుమెంటరీని ప్రదర్శన నుంచి తొలగించింది. అటు ట్విటర్ కూడా లీనా పోస్టర్‌ను తొలగించింది.