Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేను చాలా ఆనందంగా ఉన్నా, ఇలాంటి సినిమా మళ్ళీ నా జీవితంలో చేయలేను : నాగశౌర్య

Nagashaurya, Srinivas Avarsala, Malvika Nair, Padmaja Dasari and others
, శుక్రవారం, 10 ఫిబ్రవరి 2023 (08:01 IST)
Nagashaurya, Srinivas Avarsala, Malvika Nair, Padmaja Dasari and others
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ ఫిల్మ్ 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి'. టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సహ నిర్మాతగా వివేక్ కూచిభొట్ల, వ్యవహరిస్తున్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వస్తున్న ఈ చిత్రానికి అతికొద్ది కాలంలోనే రచయితగా, దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహిస్తున్నారు. 'కళ్యాణ వైభోగమే' చిత్రంతో వెండితెరపై మ్యాజిక్‌ చేసిన హిట్ జోడి నాగశౌర్య, మాళవిక నాయర్ ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
 
నాగశౌర్య, శ్రీనివాస్ అవసరాల కలయికలో వస్తున్న మూడో సినిమా ఇది. గతంలో వారి కలయికలో వచ్చిన 'ఊహలు గుసగుసలాడే', 'జ్యో అచ్యుతానంద' సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆ చిత్రాలలోని సన్నివేశాలు, సంభాషణలు, సంగీతం కట్టిపడేశాయి. నటుడిగా శ్రీనివాస్ అవసరాల ఎన్నో సినిమాలతో ఆకట్టుకున్నప్పటికీ.. ఆయన రచనకి, దర్శకత్వానికి ఫిదా అయిన ప్రేక్షకులు ఆయన దర్శకత్వంలో మూడో సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ముచ్చటగా మూడోసారి నాగశౌర్యతో కలిసి దర్శకుడిగా వెండితెరపై వెన్నెల వాన కురిపించడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' ఫస్ట్ లుక్ కి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. గురువారం సాయంత్రం ఈ చిత్ర టీజర్ విడుదలైంది. హైదరాబాద్ లో జరిగిన టీజర్ విడుదల కార్యక్రమంలో కథానాయకుడు నాగశౌర్య, కథానాయిక మాళవిక నాయర్, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల తదితరులు పాల్గొన్నారు.
 
తాజాగా విడుదలైన 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' టీజర్.. ఇష్టమైన వ్యక్తితో సముద్రపు ఒడ్డున కూర్చొని మనసు విప్పి మాట్లాడినట్లుగా, వర్షాకాలంలో ఆరుబయట కూర్చొని మిర్చి బజ్జీలు తింటూ అమ్మతో కబుర్లు చెప్పినంత హాయిగా, ఆహ్లాదకరంగా ఉంది. సహజమైన, సున్నితమైన ప్రేమకథలను తీసుకొని వాటిని సరదాగా, మనసుకి హత్తుకునేలా తెరకెక్కించడం దర్శకుడు శ్రీనివాస్ అవసరాల శైలి. ఈ చిత్రంతో ఈసారి అంతకుమించిన మ్యాజిక్ చేయబోతున్నారని టీజర్ ని బట్టి అర్థమవుతోంది. "ఇందుమూలంగా యావత్ ప్రజానీకానికి తెలియజేయునది ఏమనగా.. సంజయ్ పీసుపాటి మరియు అనుపమ కస్తూరి బెస్ట్ ఫ్రెండ్స్ అహో" అంటూ టీజర్ ప్రారంభమైన తీరు ఆకట్టుకుంది. "పాత్రకు అవసరమైతే ఎక్స్ పోజింగ్ కూడా చేస్తా" అని కథానాయకుడు అనడం, "పెళ్ళైన తర్వాత కూడా నటిస్తా" అని కథానాయిక చెప్పడం చూస్తుంటే.. నటీనటుల మధ్య ఓ అందమైన ప్రేమ కథ చూడబోతున్నామని అర్థమవుతోంది. టీజర్ లో ప్రతి ఫ్రేమ్ ఓ అందమైన పెయింటింగ్ లా ఉంది. ఇక కళ్యాణి మాలిక్ సంగీతం టీజర్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో వచ్చిన గత రెండు చిత్రాలకు అద్భుతమైన సంగీతం అందించిన కళ్యాణి మాలిక్.. మరోసారి అద్భుతం చేయబోతున్నట్లు టీజర్ తోనే తెలియజేశారు. అలాగే ఈ చిత్రాన్ని మార్చి 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
 
టీజర్ విడుదల సందర్భంగా కథానాయకుడు నాగశౌర్య మాట్లాడుతూ.. "2013 లో అవసరాల గారిని కలిశాను. ఆయనకిది మూడో సినిమా. ఆయనతో నాకిది మూడో సినిమా. కానీ నాకు మాత్రం ఇది 23వ సినిమా. నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన ద్వారానే నేను ప్రేక్షకులకు ఇంత దగ్గరయ్యాను. 'ఊహలు గుసగుసలాడే', 'జ్యో అచ్యుతానంద' సినిమాలు ఎలాగైతే గుర్తుండిపోతాయో.. ఈ సినిమా కూడా అలాగే గుర్తుండిపోతుంది. ఈ సినిమా మీద నాకు చాలా నమ్మకముంది. ఈ సినిమాని ఆయన తీసినట్లు ఎవరూ తీయలేరు. కొన్ని సినిమాలు విడుదలై విజయం సాధించాక మనకు ఆనందం కలుగుతుంది. కానీ ఈ సినిమా మాత్రం విడుదల కాకముందే నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఇలాంటి సినిమా మళ్ళీ నా జీవితంలో చేయలేను. ఇది నేను మనస్ఫూర్తిగా చెబుతున్న మాట. కళ్యాణి మాలిక్ గారిని, ఆయన పాటలను ఎప్పటికీ మరచిపోలేము. నిర్మాతలు విశ్వప్రసాద్ గారికి, దాసరి గారికి, వివేక్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మాళవిక నాకు మంచి ఫ్రెండ్. తను చాలా మంచి యాక్టర్. తనతో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది" అన్నారు.
 
మాళవిక మాట్లాడుతూ.. "టైటిల్ ని బట్టే మీరు ఈ సినిమా ఎలా ఉండబోతుందో ఊహించవచ్చు. ఇది మీ ప్రేమ కథ అయ్యుండొచ్చు. మీ స్నేహితుల ప్రేమ కథ అయ్యుండొచ్చు. కానీ ఈ సంజయ్, అనుపమల ప్రేమకథ చూడటం ఇంకా ఎక్కువ మజా వస్తుంది. ఎందుకంటే ఇది శ్రీనివాస్ గారి మ్యాజిక్. ఈ సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశమిచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు" అన్నారు.
 
దర్శకుడు శ్రీనివాస్ అవసరాల మాట్లాడుతూ.. "ఇది టీమ్ అంతా కలిసి చర్చించుకొని తీసిన సినిమా. సహజత్వానికి దగ్గరగా ఉండేలా తీశాం. సినిమాటిక్ డైలాగ్స్ తో స్క్రిప్ట్ ని రాయకుండా.. నిజ జీవితంలో వ్యక్తులు మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో, అలా సహజ సంభాషణలతో తీసిన సినిమా ఇది. మన చుట్టూ ఉండే మనుషుల మధ్య జరిగే కథ లాంటిది. నటీనటులు, టెక్నిషియన్స్ అందరం కలిసి ఒక టీమ్ లా పనిచేశాం" అన్నారు.
 
కళ్యాణి మాలిక్ మాట్లాడుతూ.. "శ్రీనివాస్ గారి సినిమా నాదాకా రావడం అదృష్టంగా భావిస్తాను. నాకు ఆయనంటే ప్రత్యేక అభిమానముంది, అందుకే ఆయన సినిమాలకు సంగీతం బాగా ఇస్తానని అంటుంటారు.. కానీ అది నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే నేను మిగతా సినిమాలకు కూడా మంచి పాటలు అందించాను. కానీ శ్రీనివాస్ గారి సినిమాల్లో పాటలు ఏదో తెలియని మ్యాజిక్ చేస్తాయి. 'ఊహలు గుసగుసలాడే', 'జ్యో అచ్యుతానంద' సినిమాల్లోని పాటలు ఎంతలా అలరించాయో ఈ సినిమాలోని పాటలు కూడా అంతే అలరిస్తాయి" అన్నారు. చిత్ర నిర్మాతలు విశ్వప్రసాద్ తనయులు ప్రణవ్ విశ్వప్రసాద్, క్రితి విశ్వప్రసాద్ లు పాల్గొని చిత్ర విజయం పట్ల నమ్మకాన్ని వ్యక్తం చేశారు. మరో నిర్మాత పద్మజ దాసరి తనయులు దాసరి శ్రేయాస్ చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు.
ఘనంగా జరిగిన ఈ వేడుకలో పాటల రచయితలు భాస్కరభట్ల, లక్ష్మిభూపాల, డీవోపీ సునీల్ కుమార్ నామ, ఎడిటర్ కిరణ్ గంటి, నటీనటులు అభిషేక్ మహర్షి, శ్రీ విద్య, వారణాసి సౌమ్య చలంచర్ల, అర్జున్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్‌.టి.ఆర్‌. గురించి ఆ దేవుడిని అడగాలి : కళ్యాణ్‌ రామ్‌