కరుణానిధిగా ప్రకాష్ రాజ్.. ఎంజీఆర్‌గా అరవింద్ సామి.. అమ్మగా కంగనా

గురువారం, 10 అక్టోబరు 2019 (11:16 IST)
తమిళనాడు మాజీ సీఎం జయలలిత బయోపిక్‌లో కంగనా రనౌత్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు ఏఎల్‌ విజయ్‌ 'తలైవి' అనే పేరిట తెరకెక్కిస్తున్నాడు. ఈ పాత్రకు సంబంధించి ఇటీవల మోల్డ్‌ కూడా తీశారు. జయలలిత పాత్రలో పరకాయం ప్రవేశం చేసే దిశగా శిక్షణ పొందుతోంది కంగనా. ఇక ఎంజీఆర్‌ పాత్రలో అరవింద్‌స్వామి నటించనున్నట్లు కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. 
 
తాజాగా కరుణానిధి పాత్రలో ప్రకాశ్‌రాజ్‌ నటించనున్నట్లు ప్రచారం సాగుతోంది. గతంలో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'ఇరువర్‌' చిత్రంలో ప్రకాశ్‌రాజ్‌ నటించారు. ఇది ఎంజీఆర్‌, కరుణానిధిల కథ అని ప్రేక్షకులు చెబుతుండగా.. చిత్రవర్గాలు మాత్రం అధికారికంగా ప్రకటించ లేదు. అందులో కరుణానిధి పాత్రలోనే ప్రకాశ్‌రాజ్‌ కనిపించారు. ఈ నేపథ్యంలో 22 సంవత్సరాల తర్వాత కరుణానిధి పాత్రలో ప్రకాశ్‌రాజ్‌ నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
 
ఇకపోతే జయలలిత పాత్రలో నటిస్తున్న కంగనా రనౌత్.. జయలలితకు సంబంధించిన పుస్తకాలను చదువుతోంది. ఈ సినిమా గురించి కంగనా మాట్లాడుతూ..''జయలలిత నటించిన సినిమాలన్నింటినీ చూస్తున్నా. అలాగే రాజకీయ వేదికలపై ఆమె ప్రసంగం వంటి పలు వీడియోలను కూడా చూసి ఆమె హావభావాలను గమనిస్తున్నా. మొత్తానికి జయలలిత బాడీలాంగ్వేజ్‌ను వీటి ద్వారా నేర్చుకుంటున్నా. ఈ సినిమాలో అసలైన జయలలితను తప్పకుండా చూస్తారని'' పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం సెలెబ్రిటీలపై దేశ ద్రోహం కేసు ... బీహార్ పోలీసుల ఆదేశాలివే