అల్లు అరవింద్ నష్టపోవడం ఏమిటి? అనే సందేహం రావచ్చు. గీతగోవింద, అల వైకుంఠపురం ఇలా సినిమాలన్నీ బాగా వసూలు చేశాయి. అయినా నష్టం వాటిల్లిందని అంటున్నారు ఆయన సన్నిహితులు. కోవిడ్ ప్రభావం సినిమారంగంపై తీవ్ర ప్రభావం చూపింది. అన్ని ప్రొడక్షన్ హౌస్‌లలో సినిమాలు ఆగిపోయాయి. కొన్ని మాత్రం పలు జాగ్రత్తలతో సినిమాలు విరామం ఇచ్చి అప్పుడప్పుడు చేసుకుంటూ పోతున్నారు.
2020 సంక్రాంతికి విడుదలైన సినిమాల తర్వాత సినిమాలపై కోవిడ్ ఉగ్రరూపం దాల్చింది. చాలా కంపెనీలు అందులో పనిచేసే స్టాఫ్‌కు జీతభత్యాలు ఇవ్వలేని స్థితి. మరికొందరు సగం జీతంతో సర్దుబాటు చేశారు. అలాంటిది ఏకంగా పెద్దపెద్ద సినిమాలు నిర్మించే గీతా ఆర్ట్స్ బేనర్ పరిస్థితి వేరే చెప్పాల్సిన పనిలేదు. `అల వైకుంఠపురం` ఊహించని విజయాన్ని ఇచ్చిన తర్వాత కోవిడ్‌తో ఊహించని దుస్థితి ఏర్పడింది. దాదాపు ఆరు సినిమాలు బేనర్‌లో నిర్మాణంలో వున్నాయి.
కోవిడ్‌తో థియేటర్లు మూతపడ్డాయి. షూటింగ్ చేసే చాన్స్ లేదు. బేనర్ నమ్ముకుని టెక్నీషియన్స్ వున్నారు. వారికి జీతం ఎలా? అందుకే ఆడపాదడపా జాగ్రత్తలతో షూటింగ్ చేసినా దాదాపు 500 మందికి పనిదొరుకుతుంది. అదేవిదంగా గీతా ఆర్ట్స్‌లో స్టాఫ్ కూడా చాలా మందే వున్నారు. వారందరికీ నెలకు వచ్చేసరికి కుటుంబాన్ని ఎలా పోషిస్తారు?
ఇవన్నీ ఆలోచించి తనకు నష్టం వచ్చినా స్టాఫ్‌ను ఎలాగోలా ఆదుకోవాలని అల్లు అరవింద్ గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఆ సమయంలోనే ఓటీటీ ప్లాట్‌ఫామ్ పుంజుకుంది. అందులో ఆహా! అనేది ఒకటి. సొంత ఓటీటీ వున్నా ఆలస్యమైనా థియేటర్లోనే సినిమాను విడుదల చేయాలని అరవింద్‌గారి పట్టుదల. ఈలోగా పెట్టిన పెట్టుబడి, రాబడి లేక భారమైనా వెరసి 8నెలలకు గాను 250 కోట్లు నష్టమొచ్చినట్లు అంచనా. అయినా సరే థియేటర్లు ప్రారంభం అయ్యేవరకు పూర్తయిన సినిమాలను ఓటీటీలో విడుదల చేయడం ఆపి థియేటర్లలో విడుదలచేయాలని నిర్ణయం తీసుకున్నారు.
ఆయన తీసుకున్న నిర్ణయమే చాలా సమంజసనమైనదని, ఇప్పుడు అనిపిస్తుందని గీతా ఆర్ట్స్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత బన్నీవాస్ తెలియజేస్తున్నారు. థియేటర్లలో వచ్చే అప్లాజ్ ఓటీటీలో వుండదు. ఆ కిక్కే వేరని ఆయన అంటున్నారు. తాజగా చావుకబురుచల్లగా, మోస్ట్ ఎలిజిబుల్ బేచిలర్ సినిమాలు వారి బేనర్‌లో విడులకు సిద్ధంగా వున్నాయి. మిగిలిన సినిమాలు షూటింగ్ దశలో వున్నాయి.