తన భర్త చేసిన ఆరోపణలపై బుల్లితెర నటి పూజిత బుధవారం స్పందించారు. తమ ఇద్దరిదీ సహజీవనం కాదనీ, తామిద్దరం పెళ్లి చేసుకున్నట్టు ఆమె స్పష్టం చేశారు. అందువల్ల తన భర్తకు శిక్షపడాల్సిందేనని ఆమె పునరుద్ఘాటించారు.
తన భర్త విజయ్ గోపాల్ ఐఏఎస్ అధికారిణి రేఖారాణిని పెళ్లి చేసుకున్నాడనీ, ఇప్పుడు తనను హత్య చేసేందుకు పథక రచన చేస్తున్నాడని ఆరోపించిన విషయం తెల్సిందే. ఇదే అంశంపై ఆమె పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. తన భర్త తనను హత్య చేసేందుకు చూస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేయగా సిటీ కమిషన్ మహేందర్ రెడ్డి తగిన ఆధారాలతో రమ్మన్నట్లు ఆమె తెలిపారు. దాంతో అన్ని ఆధారాలను ఆయనకు అందించినట్లు ఆమె తెలిపారు.
దీనిపై పూజిత భర్త విజయ్ గోపాల్ స్పందించారు. పూజితను తాను అసలు పెళ్లి చేసుకోలేదని, ఆమెతో సుమారు పన్నెండేళ్లపాటు సహజీవనం మాత్రం చేశానని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలను పూజిత ఖండించింది. తమది సహజీవనం కాదని తెలిపింది. 'మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం' అని వ్యాఖ్యానించింది. తన భర్తకు శిక్ష పడాల్సిందేనని ఉద్ఘాటించింది. ఐదేళ్ల క్రితం తన భర్త తనను, తన బిడ్డను వదిలి వెళ్లిపోయాడని పేర్కొంది.