తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు వచ్చే సెప్టెంబరు నెలలో జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రక్రియలో భాగంగా, మా అధ్యక్ష పదవి బరిలో నటుడు ప్రకాశ్ రాజ్, హీరో మంచు విష్ణు, నటి జీవిత రాజశేఖర్ ఉన్నారు. ఇపుడు తాగాజా మరో పోటీదారు పేరు తెరపైకి వచ్చింది. తాను కూడా మా అధ్యక్ష పదవి కోసం దిగుతున్నట్టు సినీ నటి హేమ ప్రకటించింది.
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, ఇప్పటికే ఉపాధ్యక్షురాలిగా, సంయుక్త కార్యదర్శిగా, ఈసీ సభ్యురాలిగా పదవులను చేపట్టినట్టు గుర్తుచేశారు. ఈ దఫా కోశాధికారి పదవికి పోటీ చేద్దామని అనుకున్నానని... అయితే ఆలోచనను మార్చుకున్నానని తెలిపారు.
ప్రకాశ్ రాజ్, విష్ణు, జీవితలు అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారని తెలిసిందని... పెద్దల వివాదాల్లో మనమెందుకు చిక్కుకోవాలని తొలుత అనుకున్నానని, అసలు ఈ ఎన్నికల్లో పోటీ చేయకూడదని భావించానని తెలిపారు.
అయితే, సినీ ప్రముఖుల నుంచి ఒత్తిడి వస్తోందని... నువ్వెందుకు పోటీ చేయకూడదని ఫోన్లు చేసి అడుగుతున్నారని చెప్పారు. నువ్వుంటే బాగుంటుందని.. అర్థరాత్రి ఫోన్ చేసినా అందుబాటులో ఉంటావని చెపుతున్నారని అన్నారు.
గత ఎన్నికల్లో తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు తనకు అండగా నిలిచిన వారికోసం... ఈసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు హేమ ప్రకటించారు. దీంతో అధ్యక్ష పదవికి గతంలో ఎన్నడూ లేనివిధంగా నలుగురు పోటీపడుతున్నారు.