బాలీవుడ్ వివాదాస్పద నటి కంగనా రనౌత్‌కు అంతకంతకూ మద్దతు పెరిగిపోతోంది. మహారాష్ట్రలోని అధికార శివసేన ప్రభుత్వంపై ఆమె పోరాటం చేస్తోంది. ఏకంగా ప్రభుత్వంతోనే ఢీకొట్టింది. తన మణికర్ణిక కార్యాలయాన్ని కూల్చివేసినా ఆమె ఏమాత్రం వెనుకంజవేయలేదు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను లక్ష్యంగా చేసుకుని విమర్శల చేస్తోంది.
తన నోరు మూయించాలనుకున్న మీరు... మిగిలిన కోట్ల గొంతుకలను మూయించగలరా? అని ఠాక్రేను సూటిగా ప్రశ్నించింది. శక్తిమంతమైన ఒక రాజకీయ నాయకుడిని, ప్రభుత్వాన్ని ఎదుర్కొంటున్న కంగనకు పలువురి మద్దతు లభిస్తోంది. తాజాగా కంగనాకు హీరో విశాల్ తన మద్దతును ప్రకటించాడు. సోషల్ మీడియా ద్వారా ఆమెకు ఒక లేఖను పంపాడు.
'డియర్ కంగన... నీ గట్స్‌కు, ధైర్యసాహసాలకు హ్యాట్సాఫ్. నీ వ్యక్తిగత సమస్య కానప్పటికీ ఒక ప్రభుత్వాన్ని నీవు ఎదుర్కొంటున్నావు. ధైర్యంగా నిలబడ్డావు. 1920లలో భగత్ సింగ్ చేసిన మాదిరి చేస్తున్నావు. ప్రభుత్వాలు తప్పు చేసినప్పుడు తమ గొంతుకను ఎలా వినిపించాలో ప్రజలకు చూపించావు. ఒక సెలబ్రిటీనే కాకుండా ఒక సామాన్యుడు కూడా ప్రభుత్వాన్ని నిలదీయవచ్చనే సందేశాన్ని సమాజానికి ఇచ్చావు. నీకు వందనాలు' అని విశాల్ అన్నాడు. అంతేకాదు 'వాక్ స్వాతంత్ర్యపు హక్కు (ఆర్టికల్ 19)' అని పేర్కొన్నాడు.