తన్విక అండ్ మొక్షిక క్రియేషన్స్ పతాకంపై నూతన తారలు రవితేజ నున్న హీరోగా, నేహ జురెల్ హీరోయిన్ గా రూపొందుతున్న చిత్రం ' రాజు గారి అమ్మాయి - నాయుడు గారి అబ్బాయి'. సత్య రాజ్ దర్శకునిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి రామిసెట్టి సుబ్బారావు, ముత్యాల రామదాసు నిర్మాతలు.
ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన "ఐ లవ్ యు" గీతం ప్రేక్షకులను కట్టిపడేసింది. తాజాగా ఈ చిత్రం నుంచి శృంగార గీతం "ధిర ధిరన" లిరికల్ వీడియో విడుదలైంది.
ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు రోషన్ సాలూరి ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం చేయటం విశేషం. రోషన్ సాలూరి స్వరపరిచిన "ధిర ధిరన" గీతం ఆకట్టుకుంటోంది. సాహితి చాగంటి ఆలపించిన ఈ పాటకు రెహమాన్ సాహిత్యం అందించారు. రోషన్ సాలూరి మధురమైన సంగీతానికి సాహితి చాగంటి గాత్రం, రెహమాన్ సాహిత్యం తోడై పాట మరింత అందంగా మారింది. లిరికల్ వీడియోలో నాయికా నాయకుల మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. థియేటర్లలో ఈ సాంగ్ యువత మనసు దోచుకోవడం ఖాయమనిపిస్తోంది.
ఈ చిత్ర కథాంశం, ఈ తరం సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుందని చిత్ర బృందం చెబుతోంది. ఇప్పటికే విడుదలైన 'రాజుగారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి' టీజర్ మెప్పించింది. ప్రేక్షకులలో ఈ సినిమాపై ఉన్న ఆసక్తిని రెట్టింపు చేయడానికి ఈ చిత్రం యొక్క ట్రైలర్ త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రం కొద్ది రోజులలో థియేటర్లలో కుటుంబ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.