ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క హైకోర్టుకు మాత్రమే భయపడేలా కనిపిస్తోంది. సినిమా టిక్కెట్ల వ్యవహారంపై హైకోర్టు కొరఢా ఝళిపించడంతో సినిమా టిక్కెట్ల రేట్లపై 11 మందితో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి హోం శాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్ నేతృత్వం వహిస్తారు. ఈ మేరకు సోమవారం ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీచేసింది.
ఇందులో రెవెన్యూ, పట్టణాభివృద్ధి, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శులు, పంచాయతీ రాజ్, న్యాయ శాఖ కార్యదర్శులు, కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్, థియేటర్ యజమాని వేమూరి బాలరత్నం, డిస్ట్రిబ్యూటర్ టి.సీతారామ్ ప్రసాద్, తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి ముత్యాల రాందాస్, సినీ గోయేర్స్ అసోసియేషన్ నుంచి ముగ్గురు ప్రతినిధులు చొప్పున ఈ కమిటీలో చోటు కల్పిస్తారు.
కోర్టులో పిటిషన్లు, సినీ పరిశ్రమ ఇబ్బందులు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై సమీక్షించి ఈ కమిటీ సమస్యకు పరిష్కారాలు చూపిస్తుందంటూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
నానికి దిల్ రాజు అండ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టిక్కెట్ల వ్యవహారంలో హీరో నాని చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదాన్నే రేపాయి. ఆయన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ నేపథ్యంలో నిర్మాత దిల్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. హీరో నాని చేసిన వ్యాఖ్యలను అర్థం చేసుకోవాలని కోరారు.
తన సినిమా రిలీజ్ అవుతున్న సమయంలో నాని చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు. కరోనాతో తీవ్రంగా ఇబ్బంది పడిన తర్వాత రిలీజైన సినిమా తమదేనని, నాని, తన కాంబినేషన్‌లో వచ్చిన 'వి' సినిమా అని గుర్తుచేశారు.
నాని ఏం చెప్పాడన్న విషయాన్ని ఆయన మనస్సులోకి వెళ్లి చూడాలని, అపుడే ఆయన బాధ ఏంటో అర్థమవుతుందని అన్నారు. తన రెండు సినిమాలు ఓటీటీకీ వెళ్లిన బాధ ఆయనలో ఉందన్నారు. నిజానికి నాని చెప్పిన విషయం ఒక్కటైతే.. జనాల్లోకి వెళ్లింది మరొకటి అని దిల్ రాజు గుర్తుచేశారు.
అలాగే, సినిమా టిక్కెట్ ధరల విషయంలో త్వరలోనే ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను కలుస్తామని చెప్పారు. అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నామన్నారు. సినీ రంగ సమస్యలను ముఖ్యమంత్రి జగన్‌కు వివరించేందుకు చిత్ర పరిశ్రమ తరపున ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఈ కమిటీలో పరిశ్రమకు చెందిన పెద్దలు సభ్యులుగా ఉంటారని చెప్పారు.