ఆరురోజుల్లో హిందీ బాహుబలి వసూళ్లు రూ.375 కోట్లు. దాసోహమంటున్న ఉత్తరాది
ఒక తెలుగు ప్రాంతీయ చిత్రం తన సరిహద్దును దాటి పాన్ ఇండియాను చుట్టిముట్టి ఒక కాల్పనిక గాధతో ఉత్తరాదిలో ఝంఝామారుతం సృష్టిస్తున్న వైనం అక్కడి కోట్లాది మంది ప్రజలను సమ్మోహన పర్చింది. ఒక మాటలో చెప్పాలంటే రొటీన్ కథలతో, కండల ప్రదర్శనతో, హీరోయిజం తళుకుబెళుకుల
కరణ్ జోహార్ మూర్చపోయాడు. హిందీ బాహుబలి2 రైట్స్‌ను 125 కోట్లకు కొనుగోలు చేసి ఉత్తరాదిలో స్వయంగా చిత్రాన్ని విడుదల చేసిన కరణ్ బాహుబలి ప్రభంజనాన్ని చూసి మాటలు రాక మూగపోయాడు. ఖాన్ త్రయంతో సహా బాలీవుడ్ సూపర్ స్టార్ల కిరీటాలను తుక్కుతుక్కుగా పగులగొట్టి రికార్డులనే మాటనే తన దరిదాపుకు రాకుండా చేసుకున్న బాహుబలి2 హిందీ ప్రాంత కలెక్షన్లు చూస్తుంటే ఈ విజువల్ వండర్ కలెక్షన్ల వండర్ ఎలా అయిందంటూ బాలీవుడ్ ప్రముఖులనుంచి సామాన్య ప్రేక్షకుల వరకు చర్చలమీద చర్చలు చేస్తున్నారు.
గత శుక్రవారం నుంచి ఈ బుధవారం వరకు కేవలం ఆరు రోజుల్లో హిందీ బాహుబలి 2 375 కోట్ల రూపాయలు వసూలు చేసి హిందీ చిత్రాల వసూళ్లను తుడిచిపెట్టేసింది. పీకే, దంగల్ సినిమాల లైఫ్ టైమ్ కలెక్షన్లను ఇప్పటికే తుడిచిపెట్టి ప్రపంచ వ్యాప్తంగా ఆరురోజుల్లో 792 కోట్లరూపాయలను కొల్లగొట్టిన బాహుబలి హిందీ ప్రాంతంలో సమీప భవిష్యత్తులో ఏ చిత్రం కూడా తనకు పోటీ రాలేదన్నంత మహాద్భుత విజయం సాధించింది.
ఒక తెలుగు ప్రాంతీయ చిత్రం తన సరిహద్దును దాటి పాన్ ఇండియాను చుట్టిముట్టి ఒక కాల్పనిక గాధతో ఉత్తరాదిలో ఝంఝామారుతం సృష్టిస్తున్న వైనం అక్కడి కోట్లాది మంది ప్రజలను సమ్మోహన పర్చింది. ఒక మాటలో చెప్పాలంటే రొటీన్ కథలతో, కండల ప్రదర్శనతో, హీరోయిజం తళుకుబెళుకులతో విసుగెత్తించిన బాలీవుడ్‌ని బాహుబలి అనే కొత్త కథే జయించేసింది. ఒక సమీక్షకుడన్నట్లు మంచి సినిమా కోసం ఎదురు చూస్తున్న హిందీ ప్రేక్షకుల కళాత్మక ఆకలిని బాహుబలి2 తీర్చివేసింది.
బాలీవుడ్ ప్రముఖుల కంటే సినిమా చూసిన ప్రేక్షకుల సగటు అభిప్రాయం వింటే ఎందుకు బాహుబలి వారిని రంజింప చేస్తోందో అర్థమవుతుంది. ఈ ఒక్క సినిమా హిందూ ప్రతిష్టను భారతదేశవ్యాప్తంగా పునస్థాపించిందని, పస లేని కథలను జనం మీదికి వదులుతున్న బాలీవుడ్ దర్శకులు, హీరోలకు పెద్ద చెంపపెట్టు ఈ సినిమా అంటూ హిందీ ప్రాంత నెటిజన్లు పేర్కొంటున్నారు.
మార్కెటింగ్ టెక్నిక్‌లను ఉపయోగించి బాహుబలి 2 కలెక్షన్ల రికార్డును భవిష్యత్తులో ఏ హిందీ చిత్రమైనా బీట్ చేయవచ్చు కానీ బాహుబలి లాంటి మాస్టర్ పీస్‌ను సృష్టించడం బాలీవుడ్ తరం కాదని నెటిజన్లు పేర్కొంటున్నారు. వీరి మాటల్లోనే బాహుబలి2 వారిని ఎందుకంతగా వశపర్చుకుందో చూద్దాం.
-- సెలవుదినాన విడుదల అవుతోంది కాబట్టి ఏ బాలీవుడ్ సినిమానూ ప్రేక్షకులు ఇకపై చూడకూడదు. మంచి దర్శకత్వ విలువలు ఉంటేనే చూడండి. లేకపోతే బాలీవుడ్ ఏదో ఒక రోజున చచ్చి ఊరుకుంటుంది.
-- బాహుబలి హిందీ ప్రాంతంలోనే 500 కోట్లకు పైగా వసూలు చేసే అవకాశం ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఖాన్ త్రయం రికార్డులు పెనుగాలికి కొట్టుకుపోయాయి (గాన్ విత్ ద విండ్)
-- ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేనంతగా నటులను, నిర్మాతలను, పంపిణీ దారులను, ప్రదర్సకులను, వాహనాలను స్టాండ్‌లో పెట్టుకునే వారిని, స్నాక్స్, శీతల పానీయాలు అమ్మే వారిని అందరినీ సంతోష పెట్టిన సినిమా బాహుబలి 2. రెండు రెట్లు మూడు రెట్లు అధికంగా చెల్లించి టికెట్ కొని చూసిన ప్రేక్షుకులైతే అందరికంటే ఎక్కువ సంతోషం పొందుతున్నారు.
--బాహుబలి2 తెచ్చిన ఈ మార్పు భారత్ లోని మొత్తం చిత్ర పరిశ్రమను పూర్తిగా మార్చివేయాలి, ఆ మార్పు ఏమిటంటే కథకు ప్రాధాన్యమున్న ఒక చిత్ర కోట్లాది మంది హృదయాలను కదిలిస్తోంది. మండువేసవిలో తమ సమస్యలన్నింటినీ గాలికొదిలేసిన జనం థియేటర్లకు తరలి వెళ్లి బాలీవుడ్2ని ఆస్వాదిస్తున్నారు. ప్రేక్షకుల హృదయంలో దాగిన అనుభూతిని ఏ మాటలూ వర్ణించలేవు. అదే బాహుబలి 2 ఇచ్చిన అనుభూతి
--భారతీయ చిత్ర పరిశ్రమలో నూతన శకం ప్రారంభమైంది. బాహుబలి సాధించిన ప్రమాణాలను ఎవ్వరూ సాధించలేరు. కనీసం ఆరేడు సంవత్సరాల పాటు బాహుబలి2 ప్రమాణం అలాగే ఉండిపోతుంది. బాలీవుడ్ ఈ చిత్రం నుంచి నేర్చుకుని జీవిత కాన్వాస్‌ను మించిన చిత్రాల కోసం పెట్టుబడి పెట్టగలిగితే అంతర్జాతీయ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకోవచ్చు.
ఇలా బాహుబలి 2 గురించి నెటిజన్లు చేసిన వ్యాఖ్యలు ఒక ఎత్తయితే.. కేంద్ర సమాచార, ప్రసార మంత్రి ఎం వెంకయ్య నాయుడు బాహుబలిని మరొక ఎత్తుకు తీసుకుపోయారు. మేక్ ఇన్ ఇండియా బావనకు అత్యద్బుత ఉదాహరణ బాహుబలి అనేశారు.
"ప్రధాని మోదీ చెప్పిన దేశీయ ప్రతిభ, మన ప్రజల సృజనాత్మక కృషికి ఇది అద్భుత ఉదాహరణ. మనందరినీ గర్వించేలా చేసిన అత్యున్నత నైపుణ్యాలతో ఈ అద్భుతాన్ని సృష్టించిన దర్శకుడు రాజమౌళిని అభినందిస్తున్నాను. భారతీయ సంస్కృతి, పురాణాలు, కాల్పనిక గాధలు ప్రాతిపదికన అల్లిన కథ, దానికి పేర్చిన స్పెషల్ ఎఫెక్టులను ప్రజలు హృదయపూర్వకంగా ఆదరిస్తారని బాహుబలి2 నిరూపించింది. ప్రస్తుతం బాలీవుడ్ చేస్తున్న రకరకాల జిమ్మిక్కులను బాహుబలి 2 ఒక్కపెట్టున తోసి పారేసింది. నాటకీయత, మహా శక్తిసంపన్నత, అంకితభావం వీటన్నింటి ప్రతి రూపం బాహుబలి2. భారతీయ సంస్కృతి, విలువల ప్రతిరూపం ఈ సినిమా"