బాలీవుడ్ నటీమణులకు బాయ్‌ఫ్రెండ్‌లను మార్చడం వెన్నతో పెట్టిన విద్య అంటారు అక్కడి సినీజనం. ఈ కోవలోకి ఇప్పుడు లారాదత్తా కూడా చేరిపోయింది. ఆమె తన బాయ్‌ఫ్రెండ్ డినో మోరియాకు హ్యాండ్ ఇచ్చి కొత్తగా టెన్నిస్ స్టార్ మహేష్ భూపతి ప్రక్కన ప్రత్యక్షమవుతోందని బాలీవుడ్ గుసగసలు పోతోంది.
వివరాలలోకి వెళితే... లారాదత్తా, మహేష్ భూపతి లండన్‌లోని జెడబ్ల్యూ మారియట్ హోటల్‌లో ఒకే గదిలో కలిసి గత కొద్ది రోజులుగా గడుపుతున్నట్లు భోగట్టా. ఇద్దరూ కలిసి ఒకే గదిలో ఉండటాన్ని బట్టి ఇరువురి మధ్య ఎఫైర్ ముదిరిపోయిందని అంటున్నారు.
ఇదే విషయంపై మహేష్ భూపతి సన్నిహితులను కదిలిస్తే... లారా మహేష్‌తో కలిసి ఉన్నమాట నిజమేననీ, కానీ వారిద్దరి మధ్య ఎఫైర్ ఉన్నదో లేదో తమకు తెలియదని అంటున్నారు. ఈ సంగతి ఇలా ఉంటే... లారా వదిలేసిన బాయ్‌ఫ్రెండ్ డినో మోరియా మాత్రం లారా పేరు చెబితే పళ్లు పట పట కొరుకుతున్నాడట. ఇలాగే సల్మాన్ ఖాన్ కూడా కత్రినా విషయంలో పళ్లు నూరి.. నూరి వాటిని అరగదీసుకుంటున్నాడని పాపం మోరియాకు తెలియదేమో!!!