లిక్కర్ బార్‌లో జరిగిన వాగ్వాదం తర్వాత ఐటీ ఉద్యోగిని కిడ్నాప్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న లక్ష్మీ మీనన్ పరారీలో ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. తమిళంలో కుమ్కీ, సుందర పాండియన్ వంటి చిత్రాలలో నటించిన ప్రముఖ నటి లక్ష్మీ మీనన్ ఇటీవల తన స్నేహితులతో కలిసి ఒక బార్‌లో ఉన్నప్పుడు ఒక ఐటీ ఉద్యోగితో గొడవకు దిగినట్లు చెబుతున్నారు.
ఈ గొడవలో ఐటీ ఉద్యోగిపై దాడి చేసి కిడ్నాప్ చేశారనే ఆరోపణలతో మిథున్, అనీష్, సోనా మోల్‌లను అరెస్టు చేశారు. ఈ గొడవలో లక్ష్మీ మీనన్ కూడా ప్రమేయం ఉందని, పోలీసులు ఆమెను ప్రశ్నించాలని యోచిస్తున్నారని, కానీ ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయిందని వార్తలు వస్తున్నాయి. ఈ సంఘటన కోలీవుడ్ సినీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
కొచ్చిలో జరిగిన ఈ కిడ్నాప్, దాడి కేసులో తమిళ నటి లక్ష్మీ మీనన్ నిందితురాలిగా పేర్కొనబడ్డారు. ఈ సంఘటన బార్ వివాదంతో ప్రారంభమై, అది కిడ్నాప్ ఆరోపణల వరకు పెరిగిందని తెలుస్తోంది. కొచ్చి నగర పోలీసు కమిషనర్ పుట్టా విమలాదిత్య ఈ వార్తను ధృవీకరించారు. మరో ముగ్గురు అనుమానితులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
1996లో జన్మించిన మీనన్, 2011లో మలయాళ చిత్రాలలో నటించడం ప్రారంభించి, ఒక సంవత్సరం తర్వాత సుందరపాండ్యన్‌తో తమిళంలోకి అడుగుపెట్టింది. తన నటనతో బాగా పాపులర్ అయిన లక్ష్మీ మీనన్ ఆపై అగ్ర తారలతో కలిసి నటించింది.