బాహుబలికి పోటీగా సంఘమిత్ర.. కేన్స్‌లో ప్రారంభం.. టైటిల్ పాత్రలో శ్రుతిహాసన్
బాహుబలికి పోటీగా కోలీవుడ్ భారీ బడ్జెట్ మూవీగా సంఘమిత్ర రూపుదిద్దుకోనుంది. బాహుబలి స్ఫూర్తితో బాలీవుడ్‌లోనే కాదు.. ఉత్తరాది, దక్షిణాదికి చెందిన సినీ పరిశ్రమలు భారీ బడ్జెట్ సినిమాలను రూపొందించడంలో తలమున
బాహుబలికి పోటీగా కోలీవుడ్ భారీ బడ్జెట్ మూవీగా సంఘమిత్ర రూపుదిద్దుకోనుంది. బాహుబలి స్ఫూర్తితో బాలీవుడ్‌లోనే కాదు.. ఉత్తరాది, దక్షిణాదికి చెందిన సినీ పరిశ్రమలు భారీ బడ్జెట్ సినిమాలను రూపొందించడంలో తలమునలయ్యాయి. ఈ క్రమంలో బాహుబలి తరహాలో భారీ చారిత్రక చిత్రాన్ని తెరకెక్కించాలని కమర్షియల్ చిత్రాల దర్శకుడు, ఖుష్బూ భర్త సుందర్.సి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో ప్రాచీన తమిళ భాషను ఉపయోగించనున్నారు. ఆర్య, జయంరవి హీరోలు కాగా, టైటిల్ రోల్‌లో శ్రుతిహాసన్ నటించనుంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ స్వరాలు అందిస్తున్నారు.
శ్రీ తేనాండ్రాల్ ఫిలింస్ బ్యానర్‌పై రూ.150 కోట్లకుపైగా బడ్జెట్‌తో తెరకెక్కబోతున్న సంఘమిత్ర అనే చిత్రాన్ని కేన్స్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవ వేదికపై చాలా గ్రాండ్‌గా ప్రారంభించబోతున్నారు. ఇందుకోసం చిత్ర యూనిట్ బుధవారం ఉదయం కేన్స్‌కు బయల్దేరింది. ఈ విషయాన్ని ఖుష్బూ ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ... జయంరవి, ఆర్య, సుందర్.సి ఫోటోలను షేర్ చేశారు. 8వ శతాబ్దం నాటి చారిత్రక కథతో ‘సంఘమిత్ర’ రూపొందనుంది.
సౌందర్యరాశి, అసమాన ధైర్యసాహసి అయిన సంఘమిత్ర తన రాజ్యాన్ని కాపాడుకొనేందుకు చేసిన పోరాటం ఆధారంగా ఈ సినిమా రూపొందుతోందని ఖుష్బూ తెలిపారు. "బాహుబలి" తరహాలోనే రెండు భాగాలుగా ‘సంఘమిత్ర’ ప్రేక్షకుల ముందుకు రానుంది.