పూరీ జగన్నాథ్, నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కాంబినేషన్‌లో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రానికి ''రీమిక్స్''అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన అదితి ఆర్య హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రానికి అనూప్ సంగీతం అందిస్తున్నారు. జగపతి బాబు ఈ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఈ మూవీలో కళ్యాణ్ రామ్ మునుపెన్నడు కనిపించని విధంగా జర్నలిస్ట్‌గా కనిపించనున్నారు. అంతేకాదు కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో కండలు తిరిగిన దేహంతో కనిపించనున్నాడట. దీనికోసం జిమ్‌లో రోజుకు ఆరు గంటలు వర్కౌట్ చేస్తున్నాడట.
కాగా, ఈ మూవీ కోసం తీసిన ఒక ఫోటోను పూరీ జగన్నాథ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఆ ఫోటోని చూసిన వారందరు నిజంగా ఇది కళ్యాణ్ రామేనా అని ఆశ్చర్యపోతున్నారు. ఎవ్వరూ గుర్తుపట్టలేనంతగా కళ్యాణ్‌ని మార్చేశాడు పూరి. గతంలో అల్లు అర్జున్, మహేష్, వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసిన పూరీ, తన సినిమాలలో హీరోల లుక్‌లు పూర్తిగా మార్చేస్తాడని అందరికి తెలిసిన విషయమే.
ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఫోటోలో కళ్యాణ్ రామ్ లుక్ చాలా వెరైటీగా, స్టైలిష్‌గా ఉండడంతో ఈ లుక్‌కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మిస్తోన్న ఈ సినిమాని పూరీ తనదైన శైలిలో ఓ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.