సుప్రీం మ్యూజిక్ అధినేత రాజు హిర్వాణి నిర్మాతగా ముంబయి తార విమలా రామన్, తరుణ్ నటిస్తోన్న చుక్కలాంటి అమ్మాయి... చక్కనైన అబ్బాయి చిత్రానికి ఇప్పటి వరకూ ముగ్గురు దర్శకులు మారారు. ఎందుకని ఆరా తీస్తే... దాని వెనుక ఎన్నో లుకలుకలు ఉన్నాయని సమాచారం.
చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న గోగినేని శ్రీను ఆ మధ్య చిత్ర షూటింగ్‌ను బ్యాంకాక్‌లో చేపట్టమని రెండో దర్శకుడు విఎన్ ఆదిత్యకు పురమాయించాడట. అనుకున్నట్లుగానే ఆదిత్య చిత్రం షూటింగ్ చేస్తున్నాడట. షూటింగ్ జరుగుతున్న సమయంలో హీరోయిన్ విమలా రామన్ చెప్పా పెట్టకుండా ముంబయి చెక్కేసిందట.
కారణం ఏమిటి చెప్మా... అని ఆమెను కదిలిస్తే... గొల్లుమందట. తనను ఎగ్జిక్యూటివ్ నిర్మాత శ్రీను మానసికంగా వేధిస్తున్నాడనీ, అందుకే వచ్చేశానని వాపోయిందట. ఈ సంగతి ఇలా ఉంటే సదరు చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విఎన్ ఆదిత్యను కూడా శ్రీను "అన్ఫిట్" అనేశాడట. దీనికి ఎన్నో కారణాలున్నాయంటున్నారు.
ఇవన్నీ ఇలా ఉంటే... విఎన్ ఆదిత్య తాజాగా ఓ సంచలన ప్రకటన చేశాడు. అదేమంటే.... చాలామంది కొత్త నిర్మాతలు కేవలం హీరోయిన్లకోసమే సినిమాలను చేసేందుకు వస్తున్నారు తప్ప ప్రేక్షకులకు వినోదాన్నందించే చిత్రాలను చేయడానికి కాదని వ్యాఖ్యానించాడు. దీంతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మొత్తానికి టాలీవుడ్ కూడా బాలీవుడ్ చిత్ర పరిశ్రమతో పోటీపడుతున్నట్లు కనబడుతోంది.