మెగాస్టార్ 'చిరంజీవి' కుటుంబం నుంచి మరో నటవారసుడు..?!
టాలీవుడ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో నటవారసులు హీరోలుగా ప్రేక్షకులను అలరిస్తోన్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి తనయుడు "చిరుత"గా రంగ ప్రవేశం చేసి, "మగధీర"గా ప్రేక్షకుల మదిలో నిలిచాడు. మరోవైపు యువసామ్రాట్ నాగార్జున కుమారుడు నాగచైతన్య "జోష్"గా వెండితెరకు పరిచయమయ్యాడు. ఇదే తరహాలో చిరంజీవి సోదరుడు నాగబాబు కుమారుడు వరుణ్ త్వరలో నటుడిగా కన్పించబోతున్నాడు. అల్లు అర్జున్, రాజ్ చరణ్ తరహాలో వరుణ్ ప్రతిష్టాత్మకంగా హీరోగా పరిచయం కాబోతున్నాడని ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి. రాబోయే రెండేళ్లలో ఇది కార్యరూపం దాల్చనుందని సినీ జనం చెవులు కొరుక్కుంటున్నారు.ఇకపోతే.. బుధవారం (28-10-09) నాగేంద్రబాబు పుట్టినరోజు. ఆయన తన సన్నిహితుల సమక్షంలో నిరాడంబరంగా తన పుట్టిన రోజును జరుపుకున్నారు. అంతేకాకుండా జీడీమెట్లలో ఐదువేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచడం వల్ల మన భవిష్యత్తరాలకు మంచి వాతావరణం గల సమాజాన్ని ఇచ్చినవారమవుతామన్నారు. మరో ముఖ్య విషయం ఏమిటంటే...? నాగబాబు కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే నాగబాబు నిర్మాతగా రామ్‌చరణ్‌తేజ, కాజల్ అగర్వాల్, జెనీలియా కాంబినేషన్లో కొత్తి చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది.