మనీషా కోయిరాలాకు నిజంగానే క్యాన్సరా?
, సోమవారం, 3 డిశెంబరు 2012 (17:21 IST)
బాలీవుడ్ నటి మనీషా కోయిరాలాకు నిజంగానే క్యాన్సరా? అందుకే ఆమెను అమెరికాకు తరలించాలని భావిస్తున్నారా? అనే ప్రశ్నలకు ఇప్పట్లో సమాధానం లభించే సూచనలు కనిపించడం లేదు. ఎందుకంటే.. మనీషాకు చేసిన జబ్బుపై ఆమె కుటుంబ సభ్యులుగానీ, చికిత్స చేసిన ముంబై జస్లోక్ ఆస్పత్రి వర్గాలు కానీ పెదవి విప్పడం లేదు. దీంతో ఆమె అభిమానులతో పాటు... బాలీవుడ్ చిత్ర రంగంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. గత నెల 28వ తేదీన అపస్మారక స్థితిలోకి జారుకున్న మనీషా కోయిరాలాను ముంబై జస్లోక్ ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స అనంతరం ఆమెను డిశ్చార్జి చేశారు. మనీషా క్యాన్సర్‌తో బాధపడుతోందని వచ్చిన కథనాలపై వివరణ ఇచ్చేందుకు ఆస్పత్రివర్గాలు నిరాకరించాయి. ఆమె పరిస్థితి బాగానే ఉందని, అంతకు మించి వివరాలు వెల్లడించలేమని వైద్యులు తెలిపారు. అయితే, మరింత మెరుగైన వైద్యం కోసం ఆమె కుటుంబసభ్యులతో కలిసి అమెరికా వెళ్లుతున్నట్టు మనీషా వదిన మీడియాకు వెల్లడించడంతో ఆమెకు క్యాన్సర్ వచ్చిందన్న అనుమానం తలెత్తుతోంది. 1991
లో 'సౌదాగర్' చిత్రంతో వెండి తెరకు పరిచయమైన నేపాలీ ముద్దుగుమ్మ మనీషా కోయిరాలా... పలు బాలీవుడ్, దక్షిణాది చిత్రాల్లోనూ నటించారు. 2010లో నేపాల్‌కు చెందిన సామ్రాట్ దహాల్‌ను వివాహం చేసుకుంది. తర్వాత వీరిద్దరు విడిపోయారు. కొంతకాలం వెండితెరకు దూరమైనప్పటికీ ఇటీవల రామ్ గోపాల్ వర్మ తీసిన "భూత్ రిటర్న్స్" చిత్రంలో మళ్లీ ముఖానికి రంగు వేసుకున్నారు.