తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వ్యవహరించాల్సిన తీరుపై ఆ పార్టీ అధినేత ఆ రాష్ట్రంలోని తమ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. రాజకీయంగా బద్ధశత్రువైన కాంగ్రెస్‌తో మహాకూటమి పేరుతో జతకట్టిన తెలుగుదేశం పార్టీపై ఎన్ని విమర్శలు వచ్చినా చంద్రబాబు పట్టించుకోలేదు. వ్రతం చెడినా ఫలితమైనా దక్కుతుందనుకుంటే అదీ కనిపించడం లేదు.
సీట్ల సర్దుబాటు విషయంలో ‘సీట్లు ముఖ్యంకాదు… కూటమే ముఖ్యం’ అని చంద్రబాబు తీసుకున్న వైఖరి తెలంగాణ టిడిపి నేతలకు మింగుడుపడలేదు. చంద్రబాబు నాయుడిలోని త్యాగయ్య ధోరణితో కాంగ్రెస్‌కు లాభం తప్ప…. టిడిపికి ఏమాత్రం ప్రయోజనం లేదని ఆ పార్టీ నేతలు పెదవి విరుస్తున్నారు.
ఎన్నికల్లో కొన్ని పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడినపుడు… సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు దక్కించుకోడానికి ఏ పార్టీ అయినా ప్రయత్నిస్తుంది. అయితే… చంద్రబాబు నాయుడి ధోరణి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. కాంగ్రెస్ ఎన్ని సీట్లు ఇస్తే అన్ని తీసుకుందాం, మనం డిమాండ్ చేయొద్దు అని నాయకులకు తేల్చి చెప్పేశారు. తెలంణాణ టిడిపి నాయకులు 18 సీట్లు అడుగుతుంటే 12 సీట్లు మాత్రమే ఇవ్వడానికి కాంగ్రెస్ సిద్ధపడింది. ఈ 12 సీట్లతోనే సర్దుకోవాలని చంద్రబాబు తేల్చిచెప్పేశారు. ఇది కచ్చితంగా తెలంగాణ టిడిపి నాయకులకు తీవ్ర నిరాశ కలిగించే అంశమే.
సీట్ల సర్దుబాటులో పంతాలకు పోయి కాంగ్రెస్ గెలిచే సీట్లు తీసుకుంటే నష్టమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. టిడిపి గెలవడం కంటే కాంగ్రెస్ గెలవడమే ప్రధానం అన్నట్లు ఆయన తేల్చిచెప్పేశారు. తెలంగాణలో మహాకూటమి గెలిస్తే… ఆ తరువాత అనేక పదవులు వస్తాయని, అప్పుడు చూసుకుందామని నాయకులకు చెప్పారట. తెలంగాణ విషయంలో ఇటువంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు?
వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి గెలవాలంటే… కాంగ్రెస్ సహకారం తప్పనిసరి. ఇప్పుడు తెలంగాణలో ఆ పార్టీతో పొత్తుపెట్టుకున్నా…. అక్కడ గెలవాలనో, ఎవర్నో ఓడించాలని మాత్రం కాదు. ఆంధ్రప్రదేశ్‌లో గెలవాలన్నది తెలంగాణ పొత్తులోని ఆంతర్యం. అందుకే అధికారంలో రాని చోట పట్టుబట్టి సీట్లు తీసుకోవడం కంటే… కాంగ్రెస్ ఇచ్చినన్ని సీట్లతో సర్దుకోవాలని భావిస్తున్నారు. ఇదే రీతిలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ సీట్లు పెద్దగా ఆశించకుండా టిడిపికి సహకరించాలన్న ఒప్పందం దీని వెనుక ఉన్నట్లు టిడిపి నేతలే చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గెలుపు కోసం తెలంగాణలో పార్టీని ఫణంగా పెట్టారని టి-టిడిపి నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.