Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలుగు భాషకు గ్రామర్ కాదు.. గ్లామర్ కూడా ఉంది: ఉప రాష్ట్రపతి వెంకయ్య

మాజీ కేంద్ర మంత్రి, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలుగు భాషా ఔన్నత్యాన్ని హైదరాబాదులోని రాజ్ భవన్‌లో నిర్వహించిన పౌర సన్మాన కార్యక్రమంలో మాట్లాడుతూ వెలుగెత్తి చాటారు. ఆంగ్ల భాష ప్రస్తుతం తెలుగు ప్రజల్ల

తెలుగు భాషకు గ్రామర్ కాదు.. గ్లామర్ కూడా ఉంది: ఉప రాష్ట్రపతి వెంకయ్య
, సోమవారం, 21 ఆగస్టు 2017 (13:06 IST)
మాజీ కేంద్ర మంత్రి, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలుగు భాషా ఔన్నత్యాన్ని హైదరాబాదులోని రాజ్ భవన్‌లో నిర్వహించిన పౌర సన్మాన కార్యక్రమంలో మాట్లాడుతూ వెలుగెత్తి చాటారు. ఆంగ్ల భాష ప్రస్తుతం తెలుగు ప్రజల్లో అంటువ్యాధిలా వ్యాపించిందన్నారు. తెలుగు భాషలోనే ప్రతీదీ వుండాలని తాను అనట్లేదని.. తెలుగు వారు కచ్చితంగా ఒక పాఠ్యాంశంగానైనా తెలుగు చదవాలని.. తెలుగు రాయడం, చదవడం రానివారికి ఉద్యోగం లేదనే షరతు పెట్టాలని వెంకయ్య అన్నారు. 
 
తెలుగు తల్లిని మరిచిపోవడం కన్నతల్లిని మరిచిపోయేందుకు సమానమని.. తెలుగు వారిగా పుట్టి.. ఉద్యోగాల కోసం ఇంగ్లీష్‌ను నేర్చుకుంటున్నారని వెంకయ్య తెలిపారు. అలాగని తాను ఇంగ్లీషుకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. తెలుగు భాషకు గ్రామర్‌తో పాటు గ్లామర్ కూడా వుందనే విషయాన్ని భావితరాలకు తెలియాలని వెంకయ్య అన్నారు. లేకుంటే మాతృభాష మరుగున పడిపోయే ప్రమాదం వుందని.. తప్పనిసరిగా తెలుగు భాష వస్తేనే ఉద్యోగం అనే నిబంధన వుంటే.. తెలుగు భాషను కాపాడుకోవచ్చునన్నారు. 
 
హైదరాబాదులోని రాజ్‌భవన్‌లో సంప్రదాయ బద్ధంగా జరిగిన ఈ పౌర సన్మాన కార్యక్రమంలో తనను గౌరవించిన గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. సన్మాన కార్యక్రమం తరువాత పసందైన విందు ఏర్పాటు చేస్తానని, మీరు తప్పకుండా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనతో అన్నారని ఉపరాష్ట్రపతి తెలిపారు. అయితే కేసీఆర్ మాటలతో కడుపు నిండిపోయిందని అన్నారు. తాను భాషా ప్రియుడ్ని, భోజన ప్రియుడ్ని కూడా అని ఆయన చెప్పారు. ఇక్కడి కొస్తే హైదరబాదు బిర్యానీ అని, అటు వెళ్తే నెల్లూరు చేపల పులుసు అని అంటారని అన్నారు. 
 
భాష, సాహిత్యం అనేవి సామాన్య ప్రజలకు అర్థమయ్యే విధంగా ఉండాలని సూచించారు. కేసీఆర్ ఆ విషయంలో నేర్పరి కొనియాడారు. ప్రజలకు అర్థమయ్యే విధంగా సామాన్యులకు చేరువయ్యే విధంగా మాట్లాడటం ఆయన గొప్పదనం అన్నారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయినా.. తెలుగు వారు విడిపోలేదని చెప్పారు. విడిపోకుండా కలహించుకునే కంటే.. విడిపోయి... సహకరించుకోవడం మిన్న అని పేర్కొన్నారు. 
 
విభజన ఎవరికీ వ్యతిరేకం కాదని.. తమ తమ రాష్ట్రాలను అభివృద్ధి చేసుకునేందుకు ఇది ఎంతగానో వుపయోగపడుతుందన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో సహకరించుకుని రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలని సూచించారు. 
 
1978లో తాను ఎమ్మెల్యేగా తొలిసారి హైదరాబాదు వచ్చానని వెంకయ్య చెప్పారు. తాను పుట్టింది నెల్లూరు జిల్లా అయితే చదివింది వైజాగ్‌లో, ఇక రాజకీయంగా ఎదిగింది, ఒదిగింది హైదరాబాదులోనేనని వెంకయ్య గుర్తు చేసుకున్నారు. హైదరాబాదును సౌత్ ఆఫ్ నార్త్ (దక్షిణాది వారికి ఉత్తరాది) అని, నార్త్ ఆఫ్ సౌత్ (ఉత్తరాది వారికి దక్షిణాది) అని అంటారని అభివర్ణించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడితే ఎంత డేంజ‌రో ఈ వీడియో చూడండి!