తెలంగాణా రాష్ట్రంలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. దీంతో హైదరాబాద్ నగరంతో పాటు.. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా, హైదరాబాద్ నగరంలోని కూకట్ పల్లి, హైదర్ నగర్, చందానగర్, గాజుల రామారం, జీడిమెట్ల, షాపూర్ నగర్, సికింద్రాబాద్, తిరుమలగిరి, బోయినపల్లి, అల్వాల్, మారేడుపల్లి, బేగంపేట, ప్యారడైజ్, అల్విన్ కాలనీ, మియాపూర్, కుత్బుల్లాపూర్ తదితర ప్రాంతాల్లో విస్తారంగా వర్షం కురిసింది.
ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షం దెబ్బకు ముందు జాగ్రత్త చర్యగా పలు ప్రాంతాల్లో కరెంట్ సరఫరాను అధికారులు నిలిపివేశారు.
ఇకపోతే, కరీంనగర్ జిల్లాలో కూడా భారీ వర్షానికి ఈదురుగాలులు తోడుకావడంతో భారీ హోర్డింగ్‌లు సైతం కూలిపోయాయి. ఈ జిల్లాలోని శంకరపట్నం, రామడుగు, చొప్పదండి, జమ్మికుంట, మానకొండూరు, పెద్దపల్లి ప్రాంతాల్లో కూడా అకాల వర్షం కురిసింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈదురుగాలుల దెబ్బకు విద్యుత్ స్తంభాలతో పాటు.. భారీ వృక్షాలు సైతం నేలకొరిగాయి.