Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రీల్ స్టోరీ తలపించే రియల్ స్టోరీ.. సోషల్ మీడియా అన్నదమ్ముల్ని అలా కలిపింది..

Advertiesment
రీల్ స్టోరీ తలపించే రియల్ స్టోరీ.. సోషల్ మీడియా అన్నదమ్ముల్ని అలా కలిపింది..
, శుక్రవారం, 5 ఏప్రియల్ 2019 (11:12 IST)
క్రికెట్ ఆడుతూ అన్నతో గొడవపడిన బాలుడు ఇంటి నుండి వెళ్లిపోయి 8 సంవత్సరాల తర్వాత తిరిగొచ్చిన ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. అయితే... బాలుడిగా వెళ్లిపోయిన అతను యువకుడిగా తిరిగి రావడం... పాత సినిమాలు చూసే అందరికీ ఇది తెలిసిన కథే అయిప్పటికీ... ఆద్యంతం సినిమా కథను తలపించే ఈ ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. 
 
వివరాలలోకి వెళ్తే... హైదరాబాద్‌లోని మౌలాలిలోని నవోదయ నగర్‌లో నివాసముండే సుసన్నా, అబ్బాస్ దంపతులకు దీపక్, దినేష్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. 2010 జనవరి 20వ తేదీన అన్నదమ్ములు క్రికెట్ ఆడుకుంటూ గొడవపడ్డంతో... అన్నపై అలిగిన దినేష్ ఇంట్లో ఎవరికీ చెప్పకుండా రూ.2వేలు తీసుకుని వెళ్లిపోయాడు. కొడుకు తిరిగి రాకపోవడంతో కంగారుపడ్డ తల్లి సుసన్నా కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ... ఫలితం లేకుండా పోయింది. 
 
కాగా.. ఇంటి నుండి పారిపోయిన దినేష్ అదే రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుని రైలెక్కి ఢిల్లీ చేరుకున్నాడు. అక్కడ పరిచయమైన ఓ సిక్కు వ్యక్తి గదిలోనే ఉంటూ పనికోసం గాలించాడు. అయితే సిక్కు వ్యక్తి అతడిని పంజాబ్‌లోని రాణాకలా గ్రామానికి తీసుకెళ్లి భూస్వామి అయిన సుభ్రాజ్ సింగ్ కుటుంబానికి అప్పగించాడు.

కొద్దిరోజులు వారి పిల్లలతో కలిసి ఆడుకున్న దినేష్‌కు చదువు కొనసాగించాలన్న కోరిక కలిగినప్పటికీ... ఎలాంటి సర్టిఫికెట్లు లేకపోవడంతో స్థానిక పాఠశాలలో చేర్చుకోమని చెప్పడంతో ఆ ప్రయత్నాన్ని కాస్తా విరమించుకున్నాడు. అయితే... ఇంగ్లీష్ వస్తే విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తానని ఓ వ్యక్తి చెప్పడంతో స్పోకెన్ ఇంగ్లీస్ క్లాసులో చేరడంతోపాటు డ్రైవింగ్ కూడా నేర్చుకుని సుభ్రాజ్ సింగ్ వద్దే పనికి చేరి నెలకు రూ.7వేల జీతం పొందుతూ... దానిలో తన ఖర్చులకు పోను ఆదా చేసిన సొమ్ముతో రూ.లక్ష పెట్టి గేదెను, మరో లక్షతో బైక్‌ని కొనుగోలు చేసాడు. 
 
జీవితం అలా సాగిపోతున్నా తన వారిని చూడాలన్న కోరిక దినేష్‌లో మరింత బలపడి... 2015లో ఓసారి పంజాబ్ నుంచి సికింద్రాబాద్ వచ్చాడు. అయితే ధైర్యం చాలక తిరిగి పంజాబ్‌కి వెళ్లిపోయాడు. యువకుడిగా మారిన దినేష్ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూండేవాడు. 2018లో దినేష్ జీనా లీమా పేరుతో ఫ్రొఫైల్ క్రియేట్ చేసి తన ఫోటోలు తరుచూ పోస్ట్ చేసేవాడు. టిక్ టాక్ లాంటి యాప్‌ల్లోనూ తన వీడియోలు పెట్టేవాడు. మరోవైపు అతడి అన్న దీపక్ ఓ వైపు బీటెక్ చేస్తూనే తమ్ముడి ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.
 
గత నెల తమ్ముడి పేరుతో ఫేస్‌బుక్‌లో సెర్చ్ చేయగా దినేష్ ఫోటోతో ఓ అకౌంట్ కనిపించడంతో... వెంటనే కుషాయిగూడ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు పాత కేసుని దుమ్ము దులిపి... సైబర్ క్రైమ్ పోలీసుల సహకారంతో దినేష్ ఆచూకీని కనుగొన్నారు. సైబర్ క్రైమ్ సీఐ తన టీమ్‌తో పంజాబ్ వెళ్లి అతడిని హైదరాబాద్‌కి తీసుకొచ్చి కుటుంబసభ్యులకు అప్పగించారు. 8ఏళ్ల తర్వాత తన కొడుకు తిరిగి రావడంతో అతడి తల్లి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. 
 
మొత్తం మీద సోషల్‌ మీడియా అంటే ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడానికో, మరొకరి రహస్యాలు బట్టబయలు చేయడానికో మాత్రమే కాకుండా... ఇలాంటి ప్రయోజనాలు కూడా ఉంటాయని ఈ ఘటన నిరూపించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాల్‌తో బైక్ రైడ్.. వీళ్లకు రూల్స్ లేవా.. యాంకర్‌పై ఫిర్యాదు..