Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దరఖాస్తుల్లో తప్పొప్పుల సవరణకు చివరి అవకాశం

tslprb
, మంగళవారం, 6 జూన్ 2023 (11:46 IST)
తెలంగాణ రాష్ట్ర పోలీసుశాఖలో ఉద్యోగాలకు పరీక్షలు రాసిన అభ్యర్థులు తమ దరఖాస్తులో ఏవైనా తప్పులు ఉంటే సరిదిద్దుకునేందుకు చివరి అవకాశం ఇస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి ఛైర్మన్‌ వి.వి.శ్రీనివాసరావు తెలిపారు. ఈ సదుపాయం ఈనెల 6వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 8వ తేదీ రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటుందన్నారు. 
 
ముఖ్యంగా, రీకౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌ కోసం 0.38 శాతం మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారన్నారు. పోలీసుశాఖలోని వివిధ విభాగాల్లో కానిస్టేబుల్‌, ఎస్సై పోస్టుల కోసం నియామక మండలి నిర్వహించిన పరీక్షలకు సంబంధించి ఇటీవల తుది ఫలితాలు వెల్లడైన సంగతి తెలిసిందే. దీంతో నియామక ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. కటాఫ్‌ మార్కులు ప్రకటించడమే తరువాయి. 
 
ఈ దశలో అభ్యర్థులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేటప్పుడు ఏవైనా తప్పులు దొర్లివుంటే వాటిని సరిదిద్దుకునేందుకు ఇప్పుడు అవకాశం ఇచ్చారు. ఈ తప్పులను మూడు రకాలుగా విభజించారు. ‘ఎ’ కేటగిరీ తప్పులను నియామక మండలి ఉద్యోగుల సమక్షంలో మాత్రమే సరిదిద్దుకోవాల్సి ఉంటుంది. ఇందులో అభ్యర్థి పేరు, జెండర్‌, కులం, స్థానికత, ఫొటో, సంతకం, వయసు వెసులుబాటు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులు, క్రీడలకు సంబంధించిన రిజర్వేషన్‌ పొందడం వంటి అంశాలు ఉంటాయి.
 
‘బి’ కేటగిరీ తప్పులను ధ్రువపత్రాల పరిశీలన సమయంలో సంబంధిత ఎస్పీ, కమిషనర్ల సమక్షంలో సరిదిద్దుకోవచ్చు. అభ్యర్థి ఇంటిపేరు, ఆధార్‌ నంబరు, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ వంటివి ఈ తరగతిలో ఉంటాయి. ఇక అభ్యర్థి లాగిన్‌ ఐడీ వంటివి ‘సి’ కేటగిరీ కిందికి వస్తాయని, వీటిని ఇప్పుడు సరిదిద్దుకోవడం సాధ్యంకాదని ఈ ప్రకటనలో వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షల్లో స్మార్ట్ కాపీయింగ్