Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నమ్మకాన్ని వమ్ము చేయను.. నా బాధ్యతను విస్మరించను : ఎమ్మెల్సీ వాణీదేవి

నమ్మకాన్ని వమ్ము చేయను.. నా బాధ్యతను విస్మరించను : ఎమ్మెల్సీ వాణీదేవి
, ఆదివారం, 21 మార్చి 2021 (13:28 IST)
తనకు అప్పగించిన గురుతర బాధ్యతను నిష్టతో నెరవేరుస్తానని హైదరాబాద్ ‌- రంగారెడ్డి - మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ సురభి వాణీదేవి స్పష్టం చేశారు. హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్‌లోని పీవీ ఘాట్‌‌కు ఆమె ఆదివారం నివాళులర్పించారు. 
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... తెరాస ఆహ్వానం మేరకు రాజకీయాల్లోకి వచ్చానని.. పెద్దగా ప్రచారం చేయకపోయినా ప్రజలు తమపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. పట్టభద్రులు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని స్పష్టం చేశారు. 
 
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన గెలుపుకోసం కృషి చేసిన కార్యకర్తలు, నేతలు, ప్రజాప్రతినిధులకు వాణీదేవి కృతజ్ఞతలు తెలిపారు. తన తండ్రి పీవీ నరసింహారావుకు తెరాస ప్రభుత్వం ఎనలేని గౌరవం ఇస్తోందన్నారు.
 
ఇదిలావుంటే, రాష్ట్రంలో గత ఆదివారం రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. హైదరాబాద్‌ - రంగారెడ్డి - మహబూబ్‌నగర్‌ స్థానంలో ఎస్‌ వాణీదేవి, నల్లగొండ - ఖమ్మం - వరంగల్‌ స్థానంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజేతలుగా నిలిచారు. 
 
హైదరాబాద్ ‌- రంగారెడ్డి - మహబూబ్‌నగర్‌ స్థానాన్ని బీజేపీ నుంచి వశం చేసుకున్న టీఆర్‌ఎస్‌ నల్లగొండ - ఖమ్మం - వరంగల్‌లో వరుసగా రెండోసారి గెలుపొందింది. దాదాపు నాలుగురోజుపాటు ఉత్కంఠ భరితంగా సాగిన ఓట్ల లెక్కింపులో ఆదినుంచీ గులాబీ పార్టీ అభ్యర్థులు తమ ఆధిక్యతను ప్రదర్శించారు. 
 
ఎలిమినేషన్‌ ప్రక్రియ మేరకు రెండో ప్రాధాన్యత ఓట్ల ఆధారంగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయం సాధించారు. పోలింగ్‌కు కేవలం 21 రోజులముందు టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా అనూహ్యంగా తెరపైకి వచ్చిన వాణీదేవి అతికొద్ది సమయంలోనే సిట్టింగ్‌ అభ్యర్థి, బీజేపీకి చెందిన రాంచందర్‌రావును మట్టి కరిపించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సాగు చట్టాలపై ఉద్యమించకపోతే.. దేశాన్ని కూడా బీజేపీ అమ్మేస్తుంది: రాకేష్ తికాయత్