Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లపై టీఆరెస్ గురి

తెలంగాణ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లపై టీఆరెస్ గురి
, శనివారం, 11 జనవరి 2020 (03:07 IST)
తెలంగాణ పురపోరులో సత్తా చాటేందుకు టీఆరెస్ పార్టీ పక్కా వ్యూహాలతో సన్నద్ధమైంది. పురపోరుపై నెలలుగా కసరత్తు చేస్తోన్న టీఆరెస్...రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోనూ గులాబీ జెండా ఎగరవేస్తామన్న ధీమాతో ఉంది.

విజయంపై పార్టీ నాయకత్వం పూర్తి విశ్వాసంతో ఉన్నప్పటికీ...ఎన్నికలను సీరియస్ గానే తీసుకునేలా శ్రేణుల్ని సిద్ధం చేసింది. ఇదే అంశంపై టీఆరెస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. పురపాలక, నగర పాలక ఎన్నికలకు తెరాస సమరోత్సాహంతో సిద్ధమైంది. రాష్ట్రావిర్భావం నుంచి ప్రతీ ఎన్నికల్లోనూ పైచేయి సాధించిన గులాబీ పార్టీ...మున్సిపాల్టీ, కార్పొరేషన్ పోరులోనూ అవే ఫలితాలు వస్తాయని ధీమాతో ఉంది.

అసెంబ్లీ మందస్తు ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తెలంగాణ రాష్ట్ర సమితి స్థానిక సంస్థల ఎన్నికలతో పాటూ హుజూర్ నగర్ ఉప-ఎన్నికలోనూ తిరుగులేని విజయం సాధించింది. పార్లమెంటు ఎన్నికల్లో కొంత నిరాశపడినప్పటికీ బల్దియా ఎన్నికల్లో జయకేతనం ఎగురవేయాలని సుమారు ఆరు నెలల క్రితమే కసరత్తు మొదలు పెట్టింది.

వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కేటీఆర్ భుజస్కంధాలపై మున్సిపల్ బాధ్యత తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మున్సిపల్ ఎన్నికల బాధ్యతను భుజాన వేసుకున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శులు, ముఖ్య నేతలతో పలు మార్లు సమావేశమైన కేటీఆర్... వ్యూహారచన చేశారు. పురుపోరును ఎదుర్కొనేందుకు పార్లమెంటు నియోజకవర్గాల వారీగా పార్టీ ప్రధాన కార్యదర్శుల నేతృత్వంలో కమిటీలు ఏర్పాటు చేశారు.

నివేదికలు తెప్పించుకున్నారు. టీఆరెస్ తో పాటు ఇతర పార్టీల బలాబలాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. కోర్టు వివాదాల కారణంగా కొన్ని రోజులు ఆగిన గులాబీ పార్టీ...కొద్ది రోజులుగా పురపోరుపై వేగం పెంచింది. గెలుపుకోసం పనిచేసిన వారికి నామినేటెడ్ పదవులు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కాగానే పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగారు.

మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ ఛైర్ పర్సన్లతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలే మంత్రి పదవులకూ... నామినేషన్ పదవుల భర్తీకి గీటురాయని తేల్చి చెప్పి...నాయకులంతా సమర్ధవంతంగా పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, స్థానిక అంశాలే ప్రచారాస్త్రాలుగా ప్రజల్లోకి వెళ్లాలని నిర్దేశించారు.

తాజాగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, పురపాలక ఇన్‌ఛార్జీలతో సమావేశమై...రాష్ట్రమంతా టీఆరెస్ కే సానుకూలంగా ధీమా వ్యక్తం చేశారు. పురపాలక ఎన్నికలకు సంబంధించిన A, B ఫారాలను ఎమ్మెల్యేలకు అందజేసిన కేసీఆర్‌...టికెట్లు రానివారు నిరాశపడకుండా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదేనని పేర్కొన్నారు.

టికెట్ దక్కక పోయినా... పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేసిన వారికి... నామినేటెడ్ పదవులు ఇస్తామని తెరాస నాయకత్వం సంకేతాలు పంపింది. మంత్రులు, ఎంపీలు కూడా క్రియా శీలకంగా పని చేసి పార్టీ అభ్యర్థుల గెలుపులో కీలక పాత్ర పోషించాలని పార్టీ అధిష్ఠానం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మంత్రులతో పాటు... నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న నేతలందరూ గెలుపు కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జిల్లాల్లో సమాంతర అభివృద్ధి: మంత్రి పేర్ని నాని