Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కేసీఆర్ అనే అనకొండను వేటాడేందుకు ఇక్కడకు వచ్చా : రేవంత్ రెడ్డి

revanth reddy
, ఆదివారం, 19 నవంబరు 2023 (08:33 IST)
dకేసీఆర్ అనే అనకొండను వేటాడేందుకే కాంగ్రెస్ పార్టీ తనను ఇక్కడకు పంపించిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా, శనివారం ఆయన బిక్కనూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గల్ఫ్ బాధితులను ఆదుకోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదని, కనీసం కార్మికుల సంక్షేమ నిధి హామీ ఇచ్చి కూడా అమలు చేయలేదని ఆరోపించారు. 
 
రైతుల భూములను మింగడానికే కేసీఆర్ కామారెడ్డికి వచ్చారన్నారు. ఇక్కడ ఓటుకు రూ.10 వేలు ఇచ్చి గెలవాలని చూస్తున్నారన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో కేసీఆర్ అమ్మమ్మ ఊరే ఉంటే రైతులు చనిపోయినప్పుడు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. కేసీఆర్ గజ్వేల్లో భూములను ఊడ్చేశారని, ఊళ్ళకు ఊళ్లలో వేలాది ఎకరాలు బంధువులు కబ్జా పెట్టేశారన్నారు. గజ్వేల్లో ఏమీ మిగలలేదన్నారు. సిద్దిపేటలో అల్లుడు హరీశ్ రావు, కొడుకు కేటీఆర్ సిరిసిల్లను ఊడ్చేశారని ఆరోపించారు. అందుకే పచ్చగా కనిపించిన కామారెడ్డిపై ఇప్పుడు కన్నేశాడన్నారు.
 
ఈ ముదిరాజ్ బిడ్డలకు రాష్ట్రం మొత్తంలో ఒక్క సీటు కూడా కేసీఆర్ ఇవ్వలేదన్నారు. ముదిరాజ్లకు సీట్లు ఇవ్వవు కానీ... ఓట్లు కావాలా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ ఇక్కడకు వచ్చాడంటే... ఇక్కడ మీ భూములు కబ్జా చేసి, మిమ్మల్ని ముంచుతారన్నారు. నలభై ఏళ్లుగా షబ్బీర్ అలీని ఈ నియోజకవర్గం ప్రజలు ఈ స్థాయికి తీసుకువచ్చారని, అలాంటి ప్రజల భూములను కేసీఆర్ లాక్కోవడానికి వస్తున్నాడని తెలిసి ఆయన ఆందోళన చెందాడని చెప్పారు. అలాంటి సమయంలో కామారెడ్డి భూములను లాక్కోవడానికి వచ్చిన అనకొండను... అడవి నుంచి పల్లెలోకి వచ్చిన పులిని వేటాడేందుకు... బయటి నుంచి వేటగాడిని పిలిపించినట్లుగా తనను అధిష్టానం కామారెడ్డికి పిలిచిందన్నారు. కామారెడ్డికి వెళ్లి అక్కడ కబ్జా చేసేందకు వచ్చిన అనకొండను వేటాడాలని తనకు ఆదేశాలు జారీ చేసిందన్నారు. అందుకే తాను ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నానని రేవంత్ రెడ్డి అన్నారు.
 
తాను కామారెడ్డిలో నామినేషన్ వేయడాన్ని చూసిన కేసీఆర్, కేటీఆర్ జీర్ణించుకోలేకపోయారన్నారు. అందుకే కేసీఆర్‌కు పిచ్చిలేసి జనగామలోని చేర్యాల సభలో తనను ఓ పిచ్చికుక్క అని తనపై ఇష్టారీతిన మాట్లాడారని చెప్పారు. కానీ దళితుడిని సీఎంగా చేస్తానన్న కేసీఆర్ మాట తప్పారని, ఇప్పుడేమో కేటీఆర్‌ను సీఎంగా చేసేందుకు సిద్ధపడ్డారన్నారు. 
 
ఈ సందర్భంగా కేటీఆర్‌ను పిచ్చికుక్క, వీధికుక్క అని నిప్పులు చెరిగారు. ఈ పిచ్చికుక్కను, వీధికుక్కను తన్ని తరిమేయాలంటే అందరూ ఏకం కావాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ వస్తే రైతుబంధు బంద్ కాదని, రైతుభరోసా కింద ప్రతి ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: తాజాగా పట్టుబడ్డ డబ్బు రూ. 6.5 కోట్లు, మొత్తం రూ. 570 కోట్లు