లాక్ డౌన్ సమయంలో దోపిడీకేదీ అనర్హత కాదని తేలిపోయింది. చేతివాటం సరిగ్గా పనిచేయకపోవడంతో ఏకంగా ఏటీఎంనే ఎత్తుకెళ్లారో ఇద్దరు దొంగలు.
సిద్ధిపేట్ జిల్లా లోని రాజీవ్ రహదారిపై సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రజ్ఞాపూర్ వద్ద జగదేవపూర్ వెళ్లే దారిలో ఉన్న 'ఇండియా వన్' ఏటీఎం చోరికి గురైందని పోలీసులు తెలిపారు.
ఏటీఎం నుంచి నగదును దొంగిలించేందుకు యత్నించిన దుండగులు, డబ్బులు రాకపోవడంతో గడ్డపారలతో దాన్ని పెకలించి ఎత్తుకెళ్లారు.
తెల్లవారే సరికి ఏటీఎం మిషన్ కనిపించక పోవడంతో ఇంటి యాజమాని నిర్వాహకులకు సమాచారమిచ్చారు. దీంతో నిర్వహకులు గజ్వేల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఏటీఎంలో ఉన్న రూ.4,98,800 నగదు ఉన్నట్లు నిర్వాహకుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.