శ్రీనగర్ నిట్ లో చదువుతున్న 130 మంది తెలుగు విద్యార్ధులను సురక్షితంగా రాష్ట్రానికి చేర్చేలా ఏర్పాట్లను చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె జోషి న్యూడిల్లీ లోని తెలంగాణభవన్ అధికారులను ఆదేశించారు. జమ్ము కాశ్మీర్ లో నెలకొన్న పరిస్ధితుల నేపధ్యంలో నిట్ విద్యార్ధులు తాము రాష్ట్రానికి రావడానికి తగు సహాయం చేయాలని కె.తారకరామారావు ను కోరారని, వారు ఈ విషయాన్ని సి.యస్ దృష్టికి తీసుకువచ్చి తగు సహాయం అందించాలని కోరారు.
ఈ విషయమై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చి తెలుగు విద్యార్ధులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకువచ్చే చర్యలను చేపట్టాలన్నారు. ప్రభుత్వ ఆదేశాలమేరకు తెలంగాణ రెసిడెంట్ కమీషనర్ జమ్ము నుండి డిల్లీ కి తీసుకరావడానికి బస్సులను ఏర్పాటు చేశారని, డిల్లీ నుండి హైదరాబాదుకు రైలులో పంపడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమీషనర్ జమ్ము కాశ్మీర్ భవన్ అధికారులతో సమావేశం కావడంతో పాటు జమ్ములోని డివిజినల్ కమీషనర్ తో మాట్లాడి విద్యార్ధులను తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నిట్ విద్యార్ధులతో తెలంగాణ భవన్ అధికారులు ఫోన్ లో టచ్ లో ఉన్నారని, వారు ఇప్పటికే శ్రీనగర్ నుండి జమ్మూకు రోడ్డు మార్గాన బయలుదేరారు.
జిఏడి అధికారులు రెసిడెంట్ కమీషనర్ కు తగు ఆదేశాలు జారీచేస్తూ, విద్యార్ధులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు.