తెలంగాణ రాష్ట్రం అప్పులు ఊబిలో కూరుకుపోతోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సోమవారం అసెంబ్లీ ఎదుట ఉన్న గన్ పార్క్ లో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. భట్టితో పాటు ఎమ్మెల్యేల దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీతక్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బట్టి మాట్లాడుతూ సవరించిన ఎఫ్.ఆర్.బీ.ఎం చట్టం వల్ల రాష్ట్రం అప్పులు ఊబిలో కూరుకుపోతుందని అన్నారు. ఎఫ్.ఆర్.బీ.ఎం. పరిమితులను 3 శాతం నుంచి 5 శాతానికి పెంచుకునేలా తాజాగా చేసిన సవరణల వల్ల తాజాగా ఏడాదికి.. రూ. 55 వేల 256 కోట్ల కొత్త అప్పులు చేసేందుకు ప్రభుత్వానికి అవకాశం లభించిందని అన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ల పేరుతో తీసుకునే లోన్లు, ఇతర గ్యారంటీలను.. 90 శాతం నుంచి 200 శాతానికి పెంచుకున్నారని భట్టి అన్నారు.
సవరించిన ఎఫ్.ఆర్.బీ.ఎం వల్ల కార్పొరేషన్ అప్పెలు, ప్రభుత్వ గ్యారంటీలు రూ. 2లక్షల 21 వేల 946 కోట్లుకు చేరుకునే అవకాశం ఉంది. దీని ప్రకారం ఇప్పటికే ఉన్న అప్పులుతో కలిపి 2023-24 నాటికి రాష్ట్ర అప్పులు రూ. 5 లక్షల 80 వేల 790 కోట్లుకు చేరుకునే అవకాశం ఉందని భట్టి అన్నారు.
ఎఫ్.ఆర్.బీఎం. సవరణల చట్టాన్ని కాంగ్రెస్ శాసనసభా పక్షం వ్యతిరేకించినా.. సంఖ్యా బలం ఉందని ఏకపక్షంగా కేసీఆర్ ప్రభుత్వం ఆమోదించుకుందని భట్టి తీవ్ర స్థాయిలో విమర్శించారు. దీని వల్ల కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంపై ప్రతి ఏడాది అప్పుల భారం మోపుతుందని అన్నారు.
ఉదాహరణకు 2019-20 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం అసలు, వడ్డీలు కలిపి రూ.23 వేల 840 కోట్ల రూపాయలు చెల్లించింది. రూ. 3 లక్షల కోట్ల అప్పులు ఉంటేనే ఇంత కడుతున్నాం.. కేసీఆర్ ప్రభుత్వం 2024 నాటికి ఈ అప్పులను రూ. 6 లక్షల కోట్లకు చేరుస్తుంది. అప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏడాది దాదాపు రూ. 50 వేల కోట్ల రూపాయలు అసలు, వడ్డీలకు చెల్లించాల్సి వస్తుంది.
మన మొత్తం రెవెన్యూ ఆదాయం రూ. లక్ష 10 వేల కోట్ల రూపాయలు. అందులో రూ. 50 వేల కోట్లు అప్పులకు, రూ. 40 వేల కోట్లు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు చెల్లిస్తే.. ప్రజలకు చేసేందుకు ఏమి ఉంటుందని ఆయన ప్రశ్నించారు. ఏదైనా చేయాలంటే మళ్లీ కొత్త అప్పులు చేయాల్సిందేనని అన్నారు. ఈ ప్రకారం పోతే.. రైతుబంధు, వ్రుద్ధాప్య ఫింఛన్లు, ఇరిగేషన్ ప్రాజెక్టుల మెయింటెనెన్స్, ఫీజు రీఎంబర్స్ మెంట్ కు డబ్బులు ఉండవని భట్టి చెప్పారు.