తమ వివాహేతర సంబంధానికి కట్టుకున్న భర్త అడ్డుగా ఉండటాన్ని జీర్ణించుకోలేని భార్య, ఆమె ప్రియుడు కలిసి భర్తను హత్య చేశారు. ఈ హత్య జరిగిన రెండు వారాల తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మండలం వెంకటాపూర్ గ్రామంలో జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన యువకుడు మహేష్ (26) ఉప్పల్‌లో పెట్రోల్ పంప్‌లో పని చేస్తున్నాడు. అతడికి మూడు సంవత్సరాల క్రితం ఓ యువతితో వివాహమైంది. వీరికి ఏడు నెలల బాబు ఉన్నాడు.
ఈ క్రమంలో సదరు యువతికి వివాహం కాకముందు ఉప్పల్‌లో ఆటో నడుపుతున్న స్టేషన్‌ఘన్‌పూర్ మండలం మీదికొండ గ్రామానికి చెందిన పసుల కుమార్‌తో పరిచయం ఉంది. అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. వివాహమైన తర్వాత కుమార్ యువతి భర్తతో పరిచయం పెంచుకుని తరుచుగా వారి ఇంటికి వచ్చి, ఆమెతో చనువుగా ఉండసాగాడు.
దీన్ని గమనించిన భర్త మహేష్... భార్యను మందలించాడు. ఈ క్రమంలో ఇద్దరు కలిసి భర్త అడ్డుతొలగించుకోవాలని ప్లాన్ చేశారు. ఇందులోభాగంగా, ఈ నెల 5న యువకుడిని తమ గ్రామానికి వెళ్లివద్దాం అని చెప్పి ఘన్‌పూర్‌కు తీసుకువచ్చాడు.
అదేసమయంలో కుమార్ తన బావమరిది అయిన స్టేషన్‌ఘన్‌పూర్ మండలం నమిలిగొండ గ్రామానికి చెందిన పాలెపు కృష్ణను వెంటబెట్టుకొని వచ్చాడు. అదే రోజు రాత్రి ఘన్‌పూర్‌లో మద్యంతోపాటు ఆహారం పార్సిల్ తీసుకొని వచ్చి నమిలిగొండ గ్రామ శివారులో బస చేశారు.
పథకం ప్రకారం ముగ్గురు మద్యం తాగి, భోజనం చేసి అక్కడే పడుకున్నారు. ఆ తర్వాత కుమార్ లేచి ఓ బండరాయితో మహేష్ తలపై బాదడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కుమార్, అతని బావమరిది కలిసి మృతదేహాన్ని సంచిలో కుక్కి సమీపంలోని వ్యవసాయ బావిలో పడేసి వెళ్లిపోయారు.
మరోవైపు తనపై అనుమానం రాకుండా ఉండేందుకు వీలుగా హతుడి భార్య తన భర్త కనిపించడం లేదని ఈ నెల 8న ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు విచారణ చేపట్టారు. మహేష్ ఫోన్ డేటా ఆధారంగా ట్రేస్ చేసి సిబ్బందితో కలిసి ఘన్‌పూర్‌కు వచ్చి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.