తెలంగాణ రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారించేందుకు ఆ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ నడుంబిగించింది. ఇందుకోసం ఏ రాష్ట్రంలోని కార్పొరేషన్ సంస్థకు రాని ఆలోచన వీరికి వచ్చిది. అంతే... అప్పుకు మద్యాన్ని సరఫరా చేయాలని నిర్ణయించింది. దుకాణందారులకు మద్యాన్ని 50 శాతం అప్పుకు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. దుకారణం దారులు కొనుగోలు చేసే మద్యానికి అదనంగా అందులో 50 శాతం లిక్కరును అప్పుగా ఇవ్వాలని నిర్ణయించింది.
దుకాణదారులు లక్ష రూపాయల విలువైన మద్యం కొనుగోలుకు చలానా తీస్తే ఇప్పటివరకు అంతే మొత్తం మద్యాన్ని సరఫరా చేసేవారు. ఇటీవల మద్యం దుకాణాల కోసం టెండర్లు పిలవగా ఒక్కొక్కరు ఒక్కో దరఖాస్తుకు రూ.2 లక్షలు చెల్లించి మరీ పదుల సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. దీంతో వారివద్ద నగదు నిల్వలు తగ్గాయి. ఈ నేపథ్యంలో మద్యం కొనుగోలుకు ఇబ్బందులు పడుతున్నారు.
దీన్ని గుర్తించిన బెవరేజెస్ కార్పొరేషన్ మద్యాన్ని అప్పుగా ఇవ్వాలని నిర్ణయించింది. లక్ష రూపాయల మద్యం కొనుగోలుకు చలానా తీస్తే దానికి అదనంగా రూ.50 వేల విలువైన మద్యాన్ని సరఫరా చేయనుంది. అయితే, ఇందుకోసం పోస్టు డేటెడ్ చెక్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ వచ్చే నెల 5 వరకు మాత్రమే అమల్లో ఉంటుంది. ఆలోపు కొనుగోలు చేసే మద్యానికి ఇది వర్తిస్తుంది.