తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఘాటు విమర్శలు గుప్పించారు. కరోనా కట్టడిలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆమె ఆరోపించారు. ఈ మేరకు ఆమె మంగళవారం ఓ జాతీయ చానెల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో విమర్శలు గుప్పించారు.
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కట్టడి విషయంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించిందని ఆమె తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. కరోనా నియంత్రణలో కేసీఆర్ సర్కార్ క్రియాశీలకంగా వ్యవహరించలేదని ఆరోపించారు. కరోనా ఉధృతిని ప్రభుత్వం అంచనా వేయలేకపోయిందన్నారు.
కరోనా నియంత్రణకు పెద్ద సంఖ్యలో టెస్టులు చేయడమే పరిష్కార మార్గమని, మొబైల్ టెస్టింగ్‌లు చేయాలని ప్రభుత్వాన్ని కోరామని, కరోనా తీవ్రత, వ్యాప్తిపై ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ.. సూచనలు చేస్తూ... ఐదారు లేఖలు రాసినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనలేదని గవర్నర్ వాపోయారు.
ఇకపోతే, ఐసీఎంఆర్ మార్గదర్శకాల మేరకే టెస్టులు చేస్తున్నామని... ప్రభుత్వం సమర్ధించుకుంటోందన్నారు. కట్టడి ప్రాంతాల విషయంలో కూడా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించిందని ఆరోపించారు. కరోనా బాధితులు ప్రభుత్వాస్పత్రుల్లో సదుపాయాలు లేక ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారని, కోవిడ్ చికిత్స తెలంగాణ ప్రభుత్వానికి భారంగా మారిందని గవర్నర్ తమిళిసై ఆరోపించారు.