కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఇంటర్ బోర్డును ఏర్పాటు చేశారు. ఈ మేరకు తెలంగాణ సర్కారు సోమవారం జీవో నంబర్ 21ను విడుదల చేసింది. ఈ క్రమంలో, త్వరలోనే తెలంగాణ రాష్ట్ర ఇంటర్ బోర్డుకు కార్యదర్శిని, ఆ తర్వాత పూర్తి స్థాయిలో బోర్డును నియమిస్తారు. బోర్డు కార్యదర్శి బాధ్యతలను తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి వికాస్ రాజెకు అప్పగిస్తున్నట్లు సమాచారం.
ఈ బోర్డు ఏర్పాటుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు రోజుల క్రితమే ఆమోదం తెలిపిన విషయం తెల్సిందే. ఆ మేరకు ఉన్నత విద్యాశాఖ రూపొందించిన చట్టం ముసాయిదాపై సంతకం చేశారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ఆధారంగా... ఏపీ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ చట్టం-1971ను తెలంగాణకు వర్తింపజేస్తూ ఉన్నత విద్యాశాఖ ముసాయిదాను తయారు చేసింది.