తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం ఎర్రగూడ అటవీ ప్రాంతంలో గుత్తికోయలు అనే గిరిజన తెగ ప్రజలు దాడిలో ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు చనిపోయారు. అటవీ భూముల్లో పోడు వ్యవసాయం వివాదం నేపథ్యంలో గుత్తికోయలు కత్తులు, వేట కొడవళ్లు, గొడ్డళ్ళతో శ్రీనివాసరావుపై కొందరు దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయాలపాలైన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
ఈ దాడి ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గుత్తికోయల చేతిలో మరణించిన అటవీశాఖ అధికారి శ్రీనివాస రావు కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ప్రకటించారు. ఆయన కుటుంబంలోని ఒకరి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఇంటి స్థలం, రిటైర్మెంట్ వయసు వరకు వేతనం అందిస్తామని తెలిపారు.
గతంలో ఫారెస్ట్ అధికారులకు గుత్తికోయలకు మధ్య ఘర్షణలు ఉన్నాయి. తాజాగా ఫారెస్ట్ అధికారులు ఆ భూముల్లో మరోసారి మొక్కలు నాటగా, వాటిని ధ్వంసం చేసేందుకు గిరిజనలు యత్నించారు.
వీరిని పారెస్ట్ రేంజర్ చలమల శ్రీనివాస రావు (42) అడ్డుకున్నారు. ఆయనపై గుత్తికోయలు వేటకొడవళ్లతో దాడిచేశారు. ఈ దాడిలో శ్రీనివాస రావు తీవ్రంగా గాయపడగా ఆయనను అటవీ సిబ్బంది కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు.