ఓ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. పండుగ వేళ ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. దీనికి కారణం వారు ఉంటున్న ఇల్లు కుప్పకూలిపోవడమే. ఈ విషాదకర ఘటన తెలంగాణా రాష్ట్రంలోని వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలి బుద్ధారంలో జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలలోని గోపాల్పేట మండలం బుద్దారానికి చెందిన చెవ్వ నరసింహా అనే వ్యక్తి ఒక యేడాది క్రితం చనిపోయారు. అయితే, శనివారం సంవత్సరీకం కావడంతో నలుగురు కొడుకులు, కోడళ్లు వారి పిల్లలతో కలిసి ఇంటికి వచ్చారు.
ఈ కార్యక్రమం అనంతరం రాత్రి భోజనాలు చేసి అందరూ కలిసి ఒకే గదిలో సభ్యులు పడుకున్నారు. పాత ఇల్లు కావడంతో ఇటీవల కురిసిన వర్షాలకు బాగా తడిసిపోయింది. కుటుంబ సభ్యులు గాఢనిద్రలో ఉండగా రాత్రి 2 గంటల ప్రాంతంలో పైకప్పు ఒక్కసారిగా కూలి వారిపై పడింది. గదిలో నిద్రిస్తున్న ఇంటి యజమాని మణెమ్మ, ఆమె కోడళ్లు సుప్రజ, ఉమాదేవి, మనవరాళ్లు వైష్ణవి, పింకిలు శిథిలాల కింద చిక్కుకుని ప్రాణాలు విడిచారు.
మణెమ్మ కుమారుడు కుమారస్వామితో పాటు మరికొందరికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల్లో చిక్కుకున్న మృతదేహాలను గ్రామస్తుల సహకారంతో వెలికి తీశారు. క్షతగాత్రుల హాహాకారాలు, బంధువుల రోదనలు సంఘటనా స్థలంలో మిన్నంటాయి.
ఈ ఘటనా స్థలాన్ని వనపర్తి జిల్లా ఇన్‌చార్జి, నాగర్ కర్నూల్ ఎస్పీ సాయి శేఖర్, వనపర్తి ఏఎస్పీ షాకీర్ హుస్సేన్, సీఐ సూర్య నాయక్, ఎస్‌ఐ రామన్ గౌడ్, స్థానిక గోపాలపేట మండల తహశీల్దార్ నరేందర్‌లు శనివారం అర్థరాత్రి సందర్శించి పరిశీలించారు. దసర, బతుకమ్మ పండుగ వేల ఈ ఘటన జరగడంతో గ్రామమంతా విషాదంలో మునిగిపోయింది.