తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు దిల్లీలో కేంద్ర మంత్రులతో ఏకాంత సమావేశాలు నిర్వహించారని ఆంధ్రజ్యోతి పత్రిక ప్రముఖంగా రాసింది. దిల్లీ పర్యటనలో సీఎం పలువురు మంత్రులతో భేటీ అయ్యారని అయితే వీటిలో ఎక్కువగా ఏకాంత సమవేశాలేనని పేర్కొంది.
రాష్ట్రానికి చెందిన పార్టీ ఎంపీలనెవరినీ దిల్లీకి రావద్దని సూచించిన సీఎం ఒంటరిగానే దిల్లీ పర్యటన చేస్తున్నారని ఆంధ్రజ్యోతి వెల్లడించింది. హోంమంత్రి అమిత్‌షా, జలశక్తి శాఖామంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ల నివాసాలకు అధికారులతో కలిసి వచ్చినా, సమావేశం మాత్రం ఏకాంతంగానే జరిపారని ఈ కథనం పేర్కొంది.
మంత్రి షెకావత్‌తో ఏ అంశంపై సమావేశమవుతున్నారో కూడా అధికారులకు సమాచారమివ్వలేదని వెల్లడించిది. హోంమంత్రి అమిత్‌షా ఇంటికి కూడా ఒంటరిగానే వెళ్లిన సీఎం కేసీఆర్ భేటీ తర్వాత వివరాలను మీడియాకు కూడా వెల్లడించలేదని ఆంధ్రజ్యోతి కథనం పేర్కొంది.